దాదాపు రెండు నెలల పాటు ఒకే రహదారిలో రాకపోకలు సాగిస్తూ.. తిరుమల చేరుకోవడానికి గంటల తరబడి వేచి చూడాల్సిన సమస్య నుంచి భక్తులకు ఉపశమనం లభించింది. గతేడాది నవంబర్ 18న కురిసిన భారీ వర్షాలకు తిరుమల తిరుపతిని గతంలో ఎన్నడూ లేనివిధంగా వరద ముంచెత్తింది. వర్షాల ప్రభావంతో తిరుమల ఎగువ కనుమ రహదారిలో పది ప్రాంతాల్లో రోడ్డు మార్గాలు దెబ్బతిన్నాయి. డిసెంబర్ 1న ఉదయం ఐదున్నర గంటల సమయంలో భారీ బండరాళ్లు పడ్డాయి. దీంతో 18వ కిలోమీటర్ నుంచి 14వ కిలోమీటర్ వరకు నాలుగు ప్రాంతాల్లో రోడ్డుమార్గం పూర్తిగా ధ్వంసమైంది. గతంలో ఎన్నడూ లేని రీతిలో కనుమ రహదారి పాడైపోవడంతో.. దిల్లీ, చెన్నై ఐఐటీ నిపుణులను పిలిపించి సర్వే చేయించారు. నిపుణుల సూచన మేరకు నిర్మాణాలను ప్రారంభించారు.
తిరుపతిలో గరుడ వారధి నిర్మిస్తున్న ఆఫ్కాన్స్ సంస్థకు రహదారి పునరుద్ధరణ పనులను అప్పగించారు. రహదారి పునరుద్ధణ నేపథ్యంలో తిరుమలకు వెళ్లే వాహనాలను 14వ కిలోమీటర్ నుంచి లింక్ రోడ్డు ద్వారా మళ్లించారు. విడతల వారీగా వాహనాలను అనుమతించారు. దీంతో తిరుమలకు వెళ్లాలన్నా.. కొండపై నుంచి తిరుపతికి చేరుకోవాలన్నా.. గంటల తరబడి వేచి ఉండాల్సి వచ్చేది.
భక్తుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకున్న తితిదే.. రహదారి పునుద్ధరణ పనులను త్వరగా పూర్తి చేయాలని భావించింది. కానీ ప్రతికూల వాతావరణ పరిస్థితులతో ఆలస్యమైంది. ఈ నెల 13న వైకుంఠ ఏకాదశి పర్వదినాన ప్రముఖుల పర్యటనలతో భక్తులకు మరింత ఇబ్బందులు ఎదురువుతాయని భావించిన తితిదే.. నిర్మాణ పనులు కొనసాగిస్తూనే వాహనాలను అనుమతించాలని నిర్ణయించింది. పనులు జరిగే ప్రాంతంలో బారికేడ్లు ఏర్పాటు చేసి.. పక్కనుంచి వాహనాలు వెళ్లేలా చర్యలు తీసుకున్నారు. తేలికపాటి వాహనాలను మాత్రమే రెండో కనుమ రహదారిలో అనుమతిస్తున్నారు.
వాహనాలను అనుమతించడంతో భక్తుల ప్రయాణ కష్టాలు తీరాయి. ఘాట్ రోడ్డులో నిరీక్షించే బాధలు తప్పాయని ఉద్యోగులు, యాత్రికులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
ఇదీ చదవండి: