కరోనా మహమ్మారి నుంచి ప్రపంచాన్ని కాపాడటానికి ఓ వైపు వైద్యరంగంలో కృషి జరుగుతుంటే.... మరోవైపు ఆధ్యాత్మికతకు నెలవైన మనదేశంలో యజ్ఞ యాగాలు, హోమాలు నిరంతరాయంగా కొనసాగుతున్నాయి. ప్రజలు సురక్షితంగా ఉండాలంటూ సంగీత కళాకారులు భక్తి గీతాలాపనలతో ప్రార్థనలు చేస్తున్నారు. పద్మావతి మహిళా విశ్వవిద్యాలయ సంగీత విభాగాధిపతి ద్వారం లక్ష్మి సంకల్పంతో పూర్వ విద్యార్థుల సంఘం ప్రారంభించిన సంగీత యజ్ఞంలో... ప్రపంచ నలుమూలల నుంచి ప్రముఖ సంగీత విద్వాంసులు భాగస్వాములవుతున్నారు.
నిరంతర అఖండ స్వరార్చనతో ప్రపంచవ్యాప్తంగా సంగీత కళాకారులు కరోనా మహమ్మారి నుంచి ఉపశమనానికి విశేష కృషి చేస్తున్నారు. దేశ విదేశాల్లో ఉన్న సంగీత విద్వాంసులు ఇళ్లల్లో ఉంటూ గానం చేస్తున్నారు. ప్రపంచ నలుమూలల నుంచి విశేష స్పందన రావడం.... పూర్వ విద్యార్థులతో పాటు సంగీత కళాకారులు భాగస్వాములవటంతో కరోనా వైరస్ నుంచి విముక్తి లభించే వరకు కార్యక్రమాన్ని కొనసాగించడానికి ప్రణాళిక రూపొందించారు. స్వరార్చనలో భాగస్వాములైన వారికి వాట్సాప్ గ్రూపు ఏర్పాటు చేసి... వారంతా నిర్దేశిత సమయంలో సంగీతార్చన చేసేలా కృషి చేస్తున్నారు.
ఇదీ చదవండి