చిత్తూరు జిల్లా వ్యవసాయ శాఖలో పరిపాలన వ్యవహారాలు ఇష్టానుసారంగా సాగుతున్నాయనే ఆరోపణలున్నాయి. వ్యవసాయ శాఖ ఇన్‌ఛార్జి జేడీగా దొరసాని గురువారం బాధ్యతలు స్వీకరించారు. జేడీ ప్రణాళికబద్ధంగా, ప్రక్షాళన దిశగా అడుగులేస్తే తప్ప పాలన వ్యవహారాలు గాడిలో పడి అవకాశాలు లేవని ఆ శాఖ అధికారులే పేర్కొంటున్నారు. కార్యాలయ పరిపాలన వ్యవహారాలు జూనియర్ అధికారికే కేంద్రీకరించారని ఆ శాఖ అధికారులే ఆరోపిస్తున్నారు. సీనియర్ అధికారులమైనప్పటికీ.. కార్యాలయంలో ఏం జరుగుతుందో? ఏ దస్త్రం ఎక్కడికిపోతుందో? ఎక్కడికి పంపారో తెలియని పరిస్థితి ఆ అధికారులది.
సీనియర్ అధికారులకు పరిపాలన బాధ్యతలు అప్పగించడంతో పాటు అధికారుల ప్రక్షాళనకు జేడీ దృష్టి సారించాల్సిన అవసరం ఉందని ఆ శాఖ అధికారులు, సిబ్బంది అభిప్రాయపడుతున్నారు. జిల్లాలోని ఎరువులు, పురుగు మందులు, విత్తన విక్రయ డీలర్ల నుంచి పెద్ద మొత్తంలో సొమ్ము వసూళ్లు చేసినట్లు ఆరోపణలున్నాయి. జిల్లాలో ఎరువులు దుకాణాలు 521, పురుగు మందుల దుకాణాలు 430, విత్తన దుకాణాల 210 ఉన్నాయి. ఖరీఫ్ సీజన్‌కు నాణ్యమైన ఎరువులు, విత్తనాలు, పురుగు మందులు అందుబాటులో ఉంచేందుకు ముందస్తుగా వ్యవసాయ శాఖ తనిఖీలు నిర్వహించి నకిలీల అమ్మకాలకు అడ్డుకట్ట వేయాల్సి ఉంది.
ఆ దిశగా ముందుకెళ్లగా అక్రమ వసూళ్లకు పాల్పడి..నకిలీల అమ్మకాలకు రాచబాట వేసినట్లైంది. పలమనేరు, మదనపల్లె, పుంగనూరు, పీలేరు, శ్రీకాళహస్తి డివిజన్ల నుంచి అధిక మొత్తంలో మిగిలిన డివిజన్ల నుంచి తక్కువ మొత్తంలో వసూళ్లు చేసినట్లు సమాచారం. డివిజన్ల వారీగా డీలర్ల నుంచే సొమ్ము వసూళ్లు చేసి ఇటీవల బదిలీ అయిన జిల్లా అధికారికి అందజేసినట్లు తెలిసింది. ఉన్నతాధికారులు స్పందించి ముందస్తు చర్యలతో నకిలీ పురుగు మందులు, విత్తనాల అమ్మకాలకు అడ్డుకట్ట వేయాలని రైతులు కోరుతున్నారు.
ఇదీ చదవండి: