చెల్లెళ్లను ప్రతిరోజూ ఊయలలో ఊపుతూ ఆడించే ఆ చిన్నారి... అనూహ్యంగా అందులోనే చిక్కుకుని ప్రాణం కోల్పోయింది. ఈ హృదయ విదారక సంఘటన చిత్తూరు జిల్లా కుప్పం మండలంలో శుక్రవారం చోటుచేసుకుంది.
చిత్తూరు జిల్లా కుప్పం మండలం చిన్నగోపనపల్లెకు చెందిన మూర్తి, రమ్య దంపతులకు నలుగురు కుమార్తెలు. మూర్తి దినసరి కూలీగా బెంగళూరులో, రమ్య కుప్పంలోని ఓ పరిశ్రమలో కార్మికురాలిగా పనిచేస్తున్నారు. పిల్లలు చిన్నగోపనపల్లెలోని నానమ్మ, తాత సంరక్షణలో ఉంటున్నారు. మూర్తి పెద్ద కుమార్తె శ్వేత(9) స్థానిక ప్రాథమిక పాఠశాలలో నాలుగో తరగతి చదువుతోంది. ఎప్పటిలాగే పాఠశాల నుంచి వచ్చిన శ్వేత శుక్రవారం తన చెల్లెళ్ల కోసం చీరతో కట్టిన ఉయ్యాలలో ఆడటం ప్రారంభించింది. ఆటలాడే ఉత్సాహంలో ఊయల మెలి తిరగడం గమనించలేదు. బాగా మెలితిరిగిన ఊయల శ్వేత మెడకు ఉచ్చులా బిగుసుకుంది. వదిలించుకునే క్రమంలో ఊయల మెడకు మరింతగా బిగుసుకు పోయింది. ఆ సమయంలో కాపాడేందుకు... ఇంట్లో ఎవరూ లేకపోవడంతో ఊపిరి ఆడక ప్రాణం విడిచింది.
ఇదీ చదవండి: బడ్జెట్: మూడు నెలలకు రూ. 86 వేల కోట్లు !