పరిషత్ ఎన్నికల్లో తప్పుడు నిర్ణయాలు తీసుకుని రాష్ట్రాన్ని అభాసుపాలు చేసిన ఎన్నికల కమిషనర్‌పై.. చట్టపరమైన చర్యలు తీసుకోవాలని తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు డిమాండ్ చేశారు. చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తిలోని పార్టీ కార్యాలయంలో ఆయన విలేకరుల సమావేశం నిర్వహించారు. ఎస్ఈసీపై చర్యలతో పాటు అవసరమైతే జైలుకు పంపాలని ఉన్నత న్యాయస్థానాన్ని కోరుతున్నామన్నారు.
'గతంలోనూ ఎందరో ఐఏఎస్‌లూ జైలుకెళ్లారు'
సీఎం జగన్ వల్ల గతంలోనూ ఎందరో ఐఏఎస్ అధికారులు జైలుకు వెళ్లినట్లు గుర్తుచేశారు. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని అధికారులు సక్రమంగా విధులు నిర్వర్తించాలని సూచించారు. అంబేడ్కర్ రాజ్యాంగాన్ని కాకుండా రాజారెడ్డి రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారని ఆరోపించారు.
కొత్తది ఇవ్వాలి..
ఏడాది కిందట ఇచ్చిన ఎన్నికల నోటిఫికేషన్ రద్దు చేసి కొత్తగా ఇవ్వాలన్నారు. స్వార్థ ప్రయోజనాల కోసం రాష్ట్రాన్ని సీఎం జగన్ కేంద్రానికి తాకట్టు పెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రోజురోజుకీ పెరుగుతున్న నిత్యావసర ధరలతో సామాన్యులకు జీవనాధారం కష్టంగా మారిందన్నారు.
జీతాలు సైతం..
ఉద్యోగులకు సైతం జీతాలు ఇవ్వలేని దయనీయ స్థితిలో ప్రభుత్వం ఉందని దుయ్యబట్టారు. తిరుపతి ఉప ఎన్నికల్లో ప్రణాళిక ప్రకారం ప్రచారం చేస్తూ.. వైకాపా అవినీతిని ప్రజలకు తెలియజేసి చైతన్యపరుస్తామని వెల్లడించారు. పార్టీ అధినేత చంద్రబాబు ఆధ్వర్యంలో ఈ నెల 8న శ్రీకాళహస్తిలో ప్రచారం నిర్వహిస్తామన్నారు.
ఇదీ చదవండి :