కుప్పం పురపాలక ఎన్నికలు రసవత్తరంగా మారాయి. నామినేషన్‌ల చివరి రోజు తెలుగుదేశం పార్టీ నుంచి పోటీచేసేందుకు వెళ్తున్న వారిపై దాడి చేసి పత్రాలను చించేసిన ఘటన మొదలు బరిలో ఉన్న అభ్యర్థిని కిడ్నాప్ చేశారంటూ అదే పార్టీ నేతలపై ఫిర్యాదు చేయడం వరకు పలు నాటకీయ పరిణామాలు చోటు చేసుకొన్నాయి. 14 వ వార్డు నుంచి తెదేపా అభ్యర్థులుగా వెంకటేశ్, ప్రకాశ్ నామినేషన్ పత్రాలు దాఖలు చేశారు. వెంకటేశ్ పత్రాలు తిరస్కరణకు గురవగా ప్రకాశ్ పోటీలో ఉన్నారు.
కాగా.. ఆదివారం ప్రకాశ్ అన్న గోవిందరాజు.. తన తమ్ముడు ప్రకాశ్‌తోపాటు కుటుంబ సభ్యులను తెలుగుదేశం నేతలు కిడ్నాప్ చేశారంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే.. ఉదయం గోవిందరాజు ఫిర్యాదు చేయగా సాయంత్రం తాము కిడ్నాప్‌నకు గురికాలేదంటూ ప్రకాశ్ కుటుంబ సభ్యులు వీడియో విడుదల చేశారు.
ప్రకాశ్ కిడ్నాప్ వ్యవహారం అంశంపై తెదేపా ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇది వైకాపా రాజకీయ ఎత్తుగడలో భాగమని తెలుగుదేశం నేత, మాజీ మంత్రి అమర్నాథ్‌రెడ్డి మండిపడ్డారు. తమ పార్టీ అభ్యర్థులను తామే కిడ్నాప్ చేశామంటూ ఫిర్యాదు చేస్తూ సరికొత్త ఆటకు తెరతీశారని ఆక్షేపించారు. తప్పుడు కేసులు బనాయించి అక్రంగా గెలిచేందుకు వైకాపా యత్నిస్తోందని ఆరోపించారు.
కుప్పం పురపాలక ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా భావించిన అధికార, ప్రతిపక్ష పార్టీలు ఎత్తుకు పైఎత్తులు వేస్తున్నాయి. స్థానికంగా నేతలు మకాం వేయడంతో రాజకీయం రసవత్తరంగా మారింది.
ఇదీ చదవండి: