రాష్ట్రంలో పౌల్ట్రీరంగ అభివృద్ధికి విశేష కృషి చేసి.. అనారోగ్యంతో కన్నుమూసిన బాలాజీ హేచరీస్ అధినేత ఉప్పలపాటి సుందరనాయుడి అంత్యక్రియలు పూర్తయ్యాయి. చిత్తూరు జిల్లా రెడ్డిగుంటలోని.. బాలాజీ హేచరీస్ ఆవరణలో అంతిమ సంస్కారాలు నిర్వహించారు. కుటుంబసభ్యులు, గ్రామస్థులు, కోళ్ల పరిశ్రమ వ్యాపారులు.. అంతిమయాత్రలో పాల్గొన్నారు. భారత్ బయోటెక్ ఎండీ కృష్ణ ఎల్ల.. సుందరనాయుడి పాడె మోశారు.
సుందరనాయుడు సోదరుడి కుమారుడు రమేశ్ బాబు అంతిమ సంస్కారాలు నిర్వహించారు. కుటుంబసభ్యులు, బంధుమిత్రుల కడపటి చూపుల అనంతరం.. సుందరనాయుడి చితికి నిప్పంటించారు. అంతకు ముందు వివిధ రంగాల ప్రముఖులు సుందరనాయుడుకు... శ్రద్ధాంజలి ఘటించారు. అమరరాజా సంస్థల వ్యవస్థాపకులు గల్లా రామచంద్రనాయుడు, చిత్తూరు ఎమ్మెల్యే శ్రీనివాసులు, మాజీ మంత్రి అమర్నాథ్‌రెడ్డి, సినీనటుడు మోహన్ బాబు సహా పలువురు నివాళులు అర్పించారు.
ప్రముఖుల నివాళి: శనివారం ఉదయం సుందరనాయుడి పార్థివదేహానికి అమరరాజా గ్రూప్స్ వ్యవస్థాపకుడు గల్లా రామచంద్రనాయుడు, అపోలో వైస్ ఛైర్‌పర్సన్ ప్రీతారెడ్డి, సినీనటుడు మోహన్‌బాబు, కేంద్ర మాజీ మంత్రి చింతా మోహన్, మాజీ మంత్రి అమరనాథరెడ్డి, అమర ఆసుపత్రి ఎండీ రమాదేవి, హైదరాబాద్ నుంచి వచ్చిన డాక్టర్ ప్రసాద్, చిత్తూరు ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు, ఎమ్మెల్సీ రాజసింహులు, ఆర్టీసీ వైస్ ఛైర్మన్ విజయానందరెడ్డి, మాజీ ఎమ్మెల్యే లలితకుమారి తదితరులు నివాళులర్పించారు. సుందరనాయుడు సతీమణి సుజీవన, అల్లుళ్లు.. ‘ఈనాడు’ ఎండీ కిరణ్, నవీన్, కుమార్తెలు, మార్గదర్శి ఎండీ శైలజాకిరణ్, నీరజ, కుటుంబసభ్యులను పరామర్శించారు. సుందరనాయుడి మరణవార్త తెలుసుకున్న వెంటనే పలువురు ప్రవాసాంధ్రులు విదేశాల నుంచి బయలుదేరి శనివారం ఉదయం చిత్తూరు చేరుకున్నారు. తమ తల్లిదండ్రులకు ఆయన అందించిన సహాయ సహకారాలు మరవలేనివని, వారి చొరవతోనే ఉన్నత స్థానాలకు ఎదిగామని స్మరించుకున్నారు.
ఆయన సేవలు చిరస్మరణీయం
సుందరనాయుడి మరణం చిత్తూరు జిల్లాకు తీరని లోటు. పౌల్ట్రీ అంటే ఏంటో తెలియని రోజుల్లో ఆ రంగంలో పరిశ్రమను స్థాపించి ఇక్కడి రైతులకు పరిచయం చేశారు. చిన్న రైతులు సైతం ఆయన మార్గంలో నడిచి ఆర్థికంగా ఎదిగి వారి సంతానాన్ని వృద్ధిలోకి తెచ్చారు. అన్నదాతలకు ఆయన చేసిన సేవలు ఎప్పటికీ గుర్తుండిపోతాయి.- గల్లా రామచంద్రనాయుడు,అమరరాజా గ్రూప్ వ్యవస్థాపకుడు
వేల మందికి ఆదర్శం
డాక్టర్ సుందరనాయుడితో మా నాన్న రామకృష్ణారెడ్డికి సత్సంబంధాలున్నాయి. చిన్నప్పటి నుంచి ఆయనతో నాకు అనుబంధం ఉంది. పశువైద్యుడిగా ప్రస్థానం ప్రారంభించిన ఆయన.. పౌల్ట్రీ రంగాన్ని ఈ ప్రాంతానికి పరిచయం చేసి చరిత్ర సృష్టించారు. ఆయన్ను ఆదర్శంగా తీసుకొని వేల మంది ఈ రంగంలోకి వచ్చారు.- అమరనాథరెడ్డి, మాజీ మంత్రి
హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో హృద్రోగ సమస్యకు చికిత్స పొందుతూ గురువారం సాయంత్రం సుందరనాయుడు తుదిశ్వాస విడిచిన విషయం తెలిసిందే. పశువైద్యుడిగా వృత్తిని ప్రారంభించిన ఆయన.. కోళ్ల పరిశ్రమలో ప్రవేశించి ఆ రంగం అభివృద్ధికి అపార కృషిచేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో తొలితరం పారిశ్రామికవేత్తగా గుర్తింపు పొందారు.
ఇదీ చదవండి: సుందరనాయుడి భౌతికకాయానికి ప్రముఖుల నివాళులు