1937లో ఉపాధి కోసం కొన్ని లక్షల కుటుంబాలు భారత్ నుంచి శ్రీలంకకు వలస వెళ్లాయి. అక్కడ టీ ఎస్టేట్లలో, రబ్బరు, మల్బరీ తోటల్లో, పట్టుగూళ్ల పెంపకం కేంద్రాల్లో ఉపాధి కూలీలుగా పనిచేస్తూ దాదాపు ఆ కుటుంబాలన్నీ అక్కడే స్థిరపడిపోయాయి. కానీ అక్కడి సింహళీయులకు, తమిళులకు మధ్య చెలరేగిన మనస్పర్థలో చాలామంది కట్టుబట్టలతో దేశం విడిచిపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అలాంటి స్థితిలో 1981లో భారత్‌కి శరణార్థులుగా వీరంతా తిరిగివచ్చారు. అలా వచ్చిన 3లక్షల కుటుంబాల్లో దాదాపు 80 నుంచి 100 కుటుంబాలకు చిత్తూరు జిల్లా కుప్పం సమీపంలోని దళవాయి కొత్తపల్లి పంచాయితీలో ఓ కాలనీని ఏర్పాటు చేసి ఆశ్రయం కల్పించారు.
వారికంటూ కొంత భూమిని ఇచ్చి.. శ్రీలంకలో నేర్చుకున్న పనుల ఆధారంగా స్థానిక అధికారులు వారికంటూ ఓ బతుకుదెరువును చూపించారు. అలా 1987 ప్రాంతంలో ఏర్పాటైన ఈ శ్రీలంక కాలనీ ప్రజలు....స్థానికంగా తమకు సాయంగా ఉంటూ...పూటగడిచేలా ఉపాధి కల్పించిన నాటి తహసీల్దార్ రాధాకృష్ణమూర్తి పేరు మీదుగా ఆర్కేఏం నగర్‌గా ఈ ప్రాంతానికి నామకరణం చేశారు. అలా తిరిగి కొత్త జీవితాల్ని ప్రారంభించిన వీరంతా దిగువ మధ్యతరగతి, పేదప్రజలే అయినా సామాజిక బాధ్యతతో జీవనం సాగిస్తూ పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నారు.
ప్రత్యేకించి వీరి జీవనశైలిలో కనిపించే కొన్ని ప్రత్యేకతలు...మిగతా వారితో విభిన్నంగా నిలబెడుతున్నాయి. శ్రీలంకలో నిత్యం ప్రకృతితో మమేకమై ఉండే దీవుల్లో పనిచేసిన వీరంతా అక్కడి పచ్చదనానికి అలవాటుపడిపోయారు. అందుకే భారత్‌కి తిరిగిన వచ్చిన తర్వాత తమకిచ్చిన కాలనీలో పెద్దఎత్తున మొక్కలను పెంచటం ప్రారంభించారు. ఇన్నేళ్ల తర్వాత ఈ ప్రాంతమంతా పచ్చనిదుప్పటిని కప్పుకున్నట్లు కనిపిస్తూ ఉంటుంది. చాలా వరకూ ఇళ్లకు బయట సరిహద్దు గోడలకు బదులు మొక్కలే దడులు కట్టి దర్శనమిస్తాయి. నాలుగైదు వరుసలుగా ఉండే ఈ ఇళ్లన్నిటికీ ఒక దగ్గర నుంచి మరో దగ్గరికి చాలా తక్కువ సమయంలో వెళ్లిపోయేలా ఇంటికిఇంటికీ మధ్య పొడవుగా దారులు సైతం వదిలారు. అంగుళం జాగా కోసం కొట్లాడుకునే వాళ్లున్న ఈ రోజుల్లో కాలనీలోని ప్రతి దారీ మరోదారిని అనుసంధానిస్తూ ఉండే ఈ ఏర్పాట్లు వింతగా అనిపిస్తాయి.
ఆ కాలనీలో ఎవరైనా మృతిచెందితే అక్కడున్న 100-120 కుటుంబాలన్నీ ఏకమై చందాలు వేసుకుని అంత్యక్రియలను నిర్వహిస్తాయి. దీని వెనుక ఓ కారణం ఉంది. వీళ్లంతా శరణార్థులుగా భారత్‌కి తిరిగి వచ్చినప్పుడు పూటగడవటం కష్టమైన నిరుపేద ప్రజలు. అలాంటప్పుడు ఓ ఇంట్లో ఓ మరణం సంభవిస్తే... ఆ ఆఖరిక్రతువు నిర్వహణ సైతం ఆ కుటుంబాలకు భారంగా ఉండేది. అలా దాదాపు మూడు దశాబ్దాల క్రితం మొదలైన ఈ సంప్రదాయం నేటికీ కొనసాగుతూనే ఉంది. కష్టకాలం వస్తే చాలు... ఒకరికొకరు తోడుగా నిలుస్తూ తమ కష్టసుఖాలను ఒకరితోఒకరు పంచుకుంటూ ఆనందంగా గడిపేస్తుంటారు ఈ కాలనీ వాసులంతా.
అవసరమైన సమయంలో తమను ఆదుకున్న ఈ ప్రాంతం రుణం తీర్చుకునేలా....పెంచుతున్న ఈ పచ్చదనం....మనుషులు మధ్య ఉండాల్సిన సఖ్యత....కష్టం వచ్చినప్పుడు కుంగిపోకుండా ఒకరికొకరు తోడు నిలబడాల్సిన అవసరాన్ని చక్కగా చాటుతూ నలుగురికీ ఆదర్శంగా నిలుస్తున్నారు శ్రీలంక కాలనీ వాసులు.
ఇదీ చదవండి: