కందూరు రోడ్డులో నివాసముంటున్న షాకీర్, సోనియా దంపతులు ఏడాదిన్నర క్రితం ప్రేమవివాహం చేసుకున్నారు. ఆ వివాహం నచ్చక వారి తరఫు పెద్దలు దూరమయ్యారు. కూలి పనులు చేసి షాకీర్ అద్దె ఇంటిలో ఉంటూ జీవనం సాగిస్తున్నారు. అయిదు నెలల కిందట ఇద్దరు కవల ఆడపిల్లలు పుట్టారు. ఇంతలోనే లాక్‌డౌన్‌తో కూలిపనులు లేక, కనీసం రేషన్‌కార్డు లేక పూట గడవడం అతి కష్టమైంది. 20 రోజుల కిందట బిడ్డ మదీనాకు విరేచనాలు కావడంతో మదనపల్లె ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ వైద్యులు తిరుపతికి తీసుకెళ్లాలని సూచించారు.
ఇంట్లోని గ్యాస్ సిలిండర్‌ను రూ.700కు అమ్మి ఆసుపత్రిలో చూపించారు. కానీ బిడ్డ ప్రాణం కాపాడుకోలేకపోయారు. బిడ్డ మృతితో మానసిక క్షోభలో ఉన్న సోనియాకు పాలు నిలిచిపోయాయి. ఇంకో పాపకైనా పాలు కొని తాగించడానికి డబ్బులు లేవని వాపోతోంది ఆ తల్లి. ఇల్లు గడిచేందుకు రూ.20వేల వరకు అప్పులు కాగా... అప్పిచ్చిన వాళ్లు నిలదీయడం వారిని మరింత విషాదంలోకి నెట్టింది. తమ దీనస్థితిని చూసి దాతలు ఆర్థికంగా ఆదుకోవాలని, అధికారులు రేషన్‌కార్డు ఇప్పించాలని కోరుతున్నారు. ఎవరూ ఆదుకోకుంటే తాము, తమ బిడ్డకు పస్తులే గతి అని చెబుతున్నారు షాకీర్ దంపతులు.
ఇవీ చూడండి..