చిత్తూరు నగరం గాంధీ విగ్రహం ఫౌంటైన్ ప్రాంగణంలో ఈ నెల 26వ తేదీన జరిగిన పారిశుద్ధ్య ఒప్పంద కార్మికుడి హత్య కేసులో.. తమిళనాడుకు చెందిన ఓ నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. రాత్రి వేళల్లో గాంధీ విగ్రహం ఫౌంటైన్ ప్రాంగణంలో పడుకునేందుకు స్థలం విషయంలో జరిగిన గొడవలే హత్యకు కారణమని పోలీసులు తెలిపారు. చిత్తూరు నగరపాలక సంస్థలో ఒప్పంద పారిశుద్ధ్య కార్మికుడిగా పని చేస్తున్న మహమ్మద్ బాషా రాత్రి వేళల్లో నగరం నడి బొడ్డున ఉన్న గాంధీ విగ్రహం ప్రాంగణంలో నిద్రించేవాడు. ఎప్పటిలాగే ఈనెల 25వ తేదీ సైతం అక్కడే నిద్రపోవడానికి వెళ్లగా.. అప్పటికే అక్కడ నిద్రిస్తున్న తమిళనాడు రాష్ట్రం వేలూరుకు చెందిన పెయింటర్ రత్నస్వామిబాబుతో గొడవ జరిగింది. పడుకునే స్థలం తనదంటే తనదంటూ ఇద్దరూ ఘర్షణ పడ్డారు. కోపం పెంచుకున్న రత్నస్వామిబాబు వేకువజామున పారిశుద్ధ్య కార్మికుడు మహమ్మద్ బాషా తలపై బండరాయితో మోది హత్య చేశాడు. అనంతరం అక్కడి నుంచి పరారయ్యాడు. ఒకటో పట్టణ పోలీస్ స్టేషన్ ఎదురుగానే ఈ ఘటన జరగడం వల్ల పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. సీసీ టీవీ ఫుటేజీ సహాయంతో నిందితుణ్ని అరెస్టు చేశారు.
ఇదీ చదవండి: