చిత్తూరు జిల్లా వాల్మీకిపురం మండలం కోటపల్లికి చెందిన రవి నుంచి అదే గ్రామానికి చెందిన ధనశేఖర్ రెడ్డి అనే వ్యక్తి రూ.3 లక్షలు అప్పు తీసుకున్నాడు. బాకీ తీర్చమని రవి తరచూ అడుగడంతో మాట్లాడుదామని ఆగస్టు 25న రవిని బయటకు తీసుకెళ్లాడు ధనశేఖర్రెడ్డి. ఎంతసేపయినా రవి ఇంటికి రాకపోయేసరికి అతని భార్య, బంధువు వెతకడం ప్రారంభించారు. చివరకు ఊరిచివర అటవీ ప్రాంతంలో రవి మృతదేహం లభించింది. ధనశేఖర్రెడ్డిపై అనుమానం ఉందని పోలీసులుకు రవి బంధువులు ఫిర్యాదుచేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఇంతలో ఈ కేసును ఉపసంహరించుకోవాలంటూ... రవి భార్యపై ధనశేఖర్రెడ్డి, ఆయన వర్గీయులు తీవ్ర ఒత్తిడి తీసుకువచ్చారు. తాను అందుకు అంగీకరించలేదని... అందుకే పోలీసులతో కొట్టించారని ఆమె ఆరోపిస్తోంది. ఇద్దరు పోలీసులు లాఠీలతో చితకబాదారని వాపోయింది.
రవి భార్యను కొట్టిన విషయాన్ని తెలుసుకున్న ప్రజా సంఘాల నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసుల తీరుకు నిరసనగా మదనపల్లిలో ఆందోళన నిర్వహించారు. మహిళను కొట్టిన పోలీసులపై చర్యలు తీసుకోవాలంటూ మదనపల్లె సబ్ కలెక్టర్ జాహ్నవికి వినతి పత్రం అందించారు.
ఇదీచదవండి.