PERMISSION TO LOKESH PADAYATRA : టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ "యువగళం" పాదయాత్రపై ఉత్కంఠ వీడింది. గత కొన్ని రోజుల నుంచి పాదయాత్రపై సందిగ్ధత నెలకొన్న సమయంలో.. దానికి తెరదించుతూ నేడు పోలీసులు నిర్ణయం తీసుకున్నారు. ఎట్టకేలకు లోకేశ్ కుప్పం నుంచి ప్రారంభించనున్న పాదయాత్రకు పోలీసులు అనుమతి ఇచ్చారు. ఈ మేరకు చిత్తూరు జిల్లా ఎస్పీ రిశాంత్‌రెడ్డి ఓ ప్రకటనలో వెల్లడించారు. షరతులతో కూడిన అనుమతి ఇస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.
పాదయాత్రలో ప్రజలు, వాహనదారులు, ఎమర్జెన్సీ సర్వీసెస్ రాకపోకలకు ఎలాంటి ఆటంకాలు కలగించొద్దని ఎస్పీ సూచించారు. ‘‘పాదయాత్ర, కుప్పంలో బహిరంగ సభకు అనుమతి కోరుతూ పలమనేరు ఎస్డీపీవో సుధాకర్‌రెడ్డికి మాజీ సీఎం చంద్రబాబు పీఏ మనోహర్ వినతిపత్రం అందించారు. దీనిపై అన్ని అంశాలను పరిశీలించి పాదయాత్రకు షరతులతో కూడిన అనుమతి మంజూరు చేశాం. అనుమతి ఇవ్వకముందే కొన్ని సోషల్ మీడియా గ్రూపుల్లో కక్ష సాధింపు అంటూ ప్రభుత్వంపై నిందలు మోపి అసత్య ప్రచారాలు చేస్తున్నారు. అన్ని రకాలుగా పరిశీలించి అనుమతి ఇచ్చాం.
బహిరంగ సభల సమయాలకు కట్టుబడి ఉండాలి. ప్రభుత్వ, ప్రైవేటు ఆస్తులకు ఎలాంటి నష్టం కలిగించకూడదు. రోడ్లపై ఎలాంటి సమావేశాలు నిర్వహించకూడదు. ఆరోగ్య అత్యవసర పరిస్థితులను నిర్వహించేందుకు సమావేశ స్థలంలో ప్రథమ చికిత్స, వైద్య పరికరాలతో అంబులెన్స్‌లను ఏర్పాటు చేసుకోవాలి. ఏదైనా అత్యవసర పరిస్థితిని ఎదుర్కొనేందుకు అగ్నిమాపక యంత్రం అందుబాటులో ఉంచాలి.
బాణసంచా కాల్పడం పూర్తిగా నిషేధం. పార్టీ కార్యకర్తలు, సమావేశంలో పాల్గొనేవారు ఎలాంటి మారణాయుధాలు తీసుకెళ్లకుండా నిర్వాహకులు జాగ్రత్తలు తీసుకోవాలి. విధుల్లో ఉన్న పోలీసులు ఎప్పటికప్పుడు ఇచ్చే ఆదేశాలను పాటించాలి. శాంతిభద్రతల నిర్వహణ, ట్రాఫిక్ నియంత్రణకు సహకరించాలి. ఈ నిబంధనలకు లోబడి పాదయాత్ర చేసుకోవాలి’’ అని ఎస్పీ పేర్కొన్నారు. అయితే షరతులతో కూడిన అనుమతులు తీసుకోవడంపై టీడీపీ నేతలు ఆలోచిస్తున్నట్లు సమాచారం. న్యాయపరమైన సంప్రదింపుల తర్వాత అనుమతి పత్రాలు తీసుకోనున్నట్లు తెలిసింది.
NARA LOKESH PADAYATRA ROUTE MAP : రాష్ట్రంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు, నిరుద్యోగమే ఏజెండాగా టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఈ నెల 27 నుంచి పాదయాత్ర చేపట్టనున్న సంగతి విధితమే. రోజుకు 10కిలో మీటర్ల చొప్పున.. 400 రోజులు.. 4000 వేల కిలో మీటర్లు యాత్ర చేయనున్నారు. కుప్పం నుంచి శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం వరకూ ఈ పాదయాత్ర సాగనుంది. కుప్పంలో మూడు రోజుల పర్యటనకు సంబంధించిన పాదయాత్ర రూట్ మ్యాప్ ఖరారైంది.
తొలిరోజు పాదయాత్ర షెడ్యూల్: ఈ నెల 27న ఉదయం 11.03 గంటలకు పాదయాత్ర ప్రారంభించనున్నారు. తొలి 3 రోజులు చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలో పర్యటించనున్నారు. నియోజకవర్గంలోని లక్ష్మీపురంలోని వరదరాజస్వామి ఆలయంలో పూజల అనంతరం పాదయాత్ర ప్రారంభం కానుంది. కుప్పం బస్టాండ్, పార్టీ కార్యాలయం, ట్రాఫిక్ ఐల్యాండ్ జంక్షన్, కుప్పం ప్రభుత్వాస్పత్రి క్రాస్ రోడ్, శెట్టిపల్లి క్రాస్‌ల మీదుగా పీఈఎస్ కళాశాల వరకు తొలిరోజు పాదయాత్ర సాగనుంది.
ఈనెల 28న పీఈఎస్ కళాశాల నుంచి శాంతిపురంలోని అరిముతనపల్లి వరకు సాగనుంది. ఈనెల 29న అరిముతనపల్లి నుంచి చెల్డిగానిపల్లె వరకు జరగనుంది. కుప్పంలో మూడు రోజుల పర్యటన నేపథ్యంలో 29 కిలో మీటర్ల మేర లోకేశ్ పాదయాత్ర సాగనుంది.
ఇవీ చదవండి: