తలకోన అటవీ ప్రాంతం... చిత్తూరు జిల్లాలోని ఎర్రావారి పాలెం మండలంలో శేషాచల అడవుల్లో విసిరిసేనట్లు ఉండే ఓ మారుమూల ప్రాంతం. ప్రకృతి రమణీయత... పక్షుల కిలకిలరావాలు...జలజలపారే సెలయేటి సవ్వడులు అలసిన హృదయాలకు ప్రశాంతంతనిచ్చే ప్రదేశంగా అలరారుతోంది తలకోన. కనుచూపుమేర కొండలు గుట్టలు వాటిపై ఎత్తైన ఎర్రచందనం వృక్షాలు మనసును అహ్లాదపరుస్తాయి. అలుముకుని ఉండే పొగమంచు తెరలతో మండే వేసవిని సైతం చల్లబరుస్తుందీ వాతావరణం.
మనసును కట్టిపడేసే అందాలు
తిరుపతి నుంచి సుమారు 60 కిలోమీటర్ల దూరంలో ఉండే తలకోనకు... పర్యాటకుల తాకిడి ఎక్కువే. వేసవిలో చిత్తూరుజిల్లా వాసులు ఒక్క సారైనా తలకోనకు వెళ్లి రావాలనుకుంటున్నారు. తిరుమలేశుడి భక్తులు...శ్రీనివాసుని దర్శనం తర్వాత తలకోన ప్రకృతి ఒడిలో గడిపేందుకు ఆసక్తి కనబరుస్తుంటారు. తలకోనకు వెళ్లే దారిలో ప్రయాణం ఓ మధురానుభూతి. ఇరువైపులా పచ్చనిచెట్లు, అల్లుకున్న పొగమంచు ఘనంగా పలుకుతుంది. వాహనాల ద్వారా తలకోన చేరిన తర్వాత జలపాతం అందాల వీక్షణకు కాళ్లకు పనిచెప్పాల్సిందే. ఎత్తయిన గుట్టలపై దాదాపు రెండు కిలోమీటర్లు నడవాలి. జిల్లా మొత్తం నీటి ఎద్దడి ఉన్నా తలకోనలో నీటి ప్రవాహం ఉంటుంది. సహజ సిద్ధమైన నీటిలో పిల్లలు, పెద్దలు అంతా కేరింతలు కొడుతూ ఉంటారు.
అడవుల్లో హాయిగా
తలకోన జలపాతంలో స్నానమాచరించిన తర్వాత.... శ్రీ సిద్ధేశ్వరస్వామిని దర్శించుకోవటం ఇక్కడి ఆచారం. అక్కడ శివయ్యకు పూజలు చేసి మొక్కులు చెల్లించుకుంటే మంచి జరుగుతుందని విశ్వాసం. తలకోనలో తితిదే ప్రత్యేకంగా వసతి గృహాలు నిర్మిస్తే....పర్యాటక సంస్థ ఎకో టూరిజం పేరుతో వెదురు కర్రలతో ఇళ్లు నిర్మించింది. గిరిజనులతో స్థానిక రుచులను పర్యాటకులకు పరిచయం చేస్తూ....పర్యాటకాభివృద్ధికి చర్యలు చేపట్టింది. శేషాచలం ప్రాముఖ్యత, ఎర్రచందనం వృక్షాల గొప్పతనం చెప్పేందుకు సిబ్బందిని నియమించారు.
ఇలా వేసవి విడిది కేంద్రంగా, ప్రకృతి రమణీయతలకు స్థావరంగా....శేషాచల అటవీ అందాలకు నెలవుగా తలకోన అటవీ ప్రాంతం పర్యాటక ప్రేమికులను కట్టిపడేస్తోంది.