చిత్తూరు జిల్లా తిరుపతిలో ఓ వృద్ధుడు దారుణ హత్యకు గురయ్యాడు. కొర్లగుంట సమీపంలోని చంద్రశేఖర్ రెడ్డి కాలనీలో వాటర్ ప్లాంట్ యజమాని గురవయ్య యాదవ్‌ను గుర్తు తెలియని వ్యక్తులు గొంతుకోసి హతమార్చారు. ఘటన గురించి తెలుసుకున్న తూర్పు పోలీస్ స్టేషన్ పోలీసులు హత్య జరిగిన ప్రాంతాన్ని పరిశీలించారు.
మాస్క్‌లు ధరించి, ద్విచక్రవాహనంపై వచ్చిన ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు డబ్బాలో నీళ్లు నింపుతున్న గురవయ్యతో పక్కన కూర్చుని మాటలు కలిపారని పోలీసులు తెలిపారు. కొంత సమయం మాట్లాడిన తర్వాత కత్తితో గొంతు కోసి పరారయ్యారన్నారు. తీవ్ర గాయాలైన గురవయ్యను స్థానికులు సమీపంలోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. వారు చికిత్సకు నిరాకరించడంతో... రూయా ఆసుపత్రికి తీసుకెళ్లారు. దారి మధ్యలోనే ప్రాణాలు కోల్పోయినట్లు డాక్టర్లు తెలిపారు.