కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతున్నా.... భౌతిక దూరం పాటించడంలో మాత్రం ప్రజలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. నిత్యావసరాలు కొనుగోలు మొదలు.... బ్యాంకుల్లో నగదు డ్రా చేసే వరకు.. పని ఏదైన ప్రజల స్పందన ఒకేలా ఉంటోంది. వ్యక్తుల మధ్య దూరం కనీసం మూడు అడుగులు ఉండాలన్న నియమాలను పాటించడం లేదు. ఆధార్‌కార్డులో మార్పులు చేర్పుల కోసం తిరుపతి కేంద్ర తపాలా కార్యాలయం వద్దకు వచ్చిన వినియోగదారులు ఒకరిపై ఒకరు పడుతూ తోపులాటలకు దిగడం గమనార్హం.
ఆధార్ కార్డులో చిరునామా, చరవాణి నంబర్లు, పుట్టిన తేదీ మార్పుతో పాటు పేర్ల అక్షర దోషాల సవరణ వంటి వివిధ కార్యక్రమాలకు గతంలో బ్యాంకులు, మీసేవా కేంద్రాల్లో అవకాశం కల్పించారు. కరోనా మహమ్మారి కేసులు పెరుగటంతో... బ్యాంకులతో పాటు ఇతర ప్రాంతాల్లో ఆధార్‌కార్డుల సవరణల అధికారాలను తొలగించారు. దీంతో తిరుపతి కేంద్ర తపాలా కార్యాలయం వద్ద ఆధార్ కార్డులో సవరణల కోసం ప్రజలు భారీగా తరలివచ్చారు.
రోజుకు 30 మందికి మాత్రమే అవకాశం కల్పిస్తూ....పదిహేను రోజులకు అవసరమైన మేర టోకెన్లు జారీ చేశారు. టోకెన్లు జారీ చేస్తున్న సంఖ్య తక్కువగా ఉండటం... జనాలు పెరిగిపోవడంతో తపాలా కార్యాలయం వద్ద ప్రజలు బారులు తీరారు. భౌతిక దూరం పాటించకుండా ఒకరిని ఒకరు తోసుకొంటూ టోకెన్లు పొందడానికి ప్రయత్నించారు.
ఇదీ చదవండి: చిత్తూరు: ఖననం అడ్డగింత వ్యవహారంలో మరో మలుపు