చిత్తూరు జిల్లా పలమనేరులో గణేశ్ అనే వ్యక్తిని నరబలి ఇచ్చేందుకు కొందరు ప్రయత్నించారని బంధువులు ఆరోపించారు. కాలిన గాయాలతో గణేశ్ తిరుపతిలోని రుయా ఆస్పత్రిలో చేరాడు. గుప్తనిధుల కోసమే గణేశ్‌ను బలి ఇచ్చేందుకు యత్నించారని బంధువులు చెబుతున్నారు. బాధితుడు, బంధువులు, అధికారులు తెలిపిన వివరాల ప్రకారం... ఈ నెల 15న గణేశ్ మరికొందరితో కలిసి ఓ అటవీ ప్రాంతానికి గుప్తనిధుల వేట కోసం వెళ్లాడు. వీరి వెంట ఓ స్వామీజీ కూడా ఉన్నాడు. కొంత దూరం వెళ్లాక గణేశ్‌ను సృహతప్పి పోయేలా చేసి బలి ఇచ్చేందుకు యత్నించారు. ఏం జరిగిందో ఏమో కొంతసేపటికి వారే గణేశ్‌ను తిరిగి ఇంటికి తరలించారు. తనకు ఏమైందని గణేశ్ అడిగితే... కరెంట్ షాక్ తగిలిందని వారు చెప్పారు.
అక్కడ కరెంట్ తీగలు లేవు
ఈ గుప్తనిధుల వ్యవహారంపై అధికారులు భిన్న ప్రకటనలు చేస్తున్నారు. గణేశ్ ఒంటిపై విద్యుదాఘాతం ఆనవాళ్లు లేవని అటవీశాఖ అధికారులు తెలిపారు. ఘటన జరిగిన చోట కరెంటు తీగలు లేవని చెబుతున్నారు. గాయాలు చూస్తే కత్తితో నరికినట్లు ఉందని ఫారెస్ట్ రేంజ్ అధికారి మదన్‌మోహన్‌రెడ్డి వెల్లడించారు. అయితే విద్యుత్ తీగలు తగలడం వల్లే గణేశ్ గాయపడ్డారని పలమనేరు ఎస్‌ఐ తెలిపారు. అధికారుల భిన్న ప్రకటనలతో గణేశ్ కుటుంబసభ్యులు ఆందోళన చెందుతున్నారు. అసలు అడవిలో ఏం జరిగిందో తెలిస్తే కానీ ఈ వ్యవహారం ఓ కొలిక్కిరాదు.