Nara Lokesh Padayatra in Thamballapalle: వైసీపీ పాలనలో నష్టపోయింది యువతనేనని తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఆరోపించారు. 44వ రోజు చిత్తూరు జిల్లాలోని తంబళ్లపల్లె నియోజకవర్గం మద్దయ్యగారిపల్లిలో యువతతో నిర్వహించిన సమావేశంలో ఆయన పాల్గొన్నారు. చంద్రబాబు పాలనలో రాష్ట్రం జాబ్ క్యాపిటల్ ఆఫ్ ఇండియాగా ఉండేదని వెల్లడించారు. జగన్ పాలనలో గంజాయి క్యాపిటల్ ఆఫ్ ఇండియాగా మార్చారని లోకేశ్ ఎద్దేవా చేశారు.
రాష్ట్రవ్యాప్తంగా గంజాయి అక్రమ రవాణా చేస్తుంది వైసీపీ నాయకులే అని లోకేశ్ ఆరోపించారు. నాలుగేళ్లు ఇంట్లో పడుకున్న జగన్.. ఇప్పుడు సమ్మిట్ అంటూ మోసం చేయాలని చూస్తున్నారని ఆరోపించారు. ఉన్న కంపెనీలు పక్క రాష్ట్రాలకు తరిమేశారని విమర్శించారు. ఉడ్తా పంజాబ్ చూశామని... ఇప్పుడు ఉడ్తా ఏపీ చూస్తున్నామని లోకేశ్ విమర్శలు గుప్పించారు. గంజాయి సప్లయ్ అంతా వైసీపీ నాయకుల ద్వారానే జరుగుతోందని లోకేశ్ ఆరోపించారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే గంజాయి లేని రాష్ట్రంగా మార్చేందుకు యుద్దప్రాతిపదికన చర్యలు తీసుకుంటామని తెలిపారు.
తంబళ్లపల్లెలో కంపెనీలు రావాలంటే ప్రజలు పెద్దిరెడ్డి కుటుంబానికి బై బై చెప్పాలన్నారు. పార్లమెంట్లో ఎంపీ మిథున్ రెడ్డి ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. ఒక్క కంపెనీ కూడా తేలేకపోయారని విమర్శించారు. వాళ్ళ సొంత కంపెనీ అభివృద్ది తప్ప.. ఒక్క నిరుద్యోగ యువతకు ఉద్యోగం ఇప్పించలేదని లోకేశ్ ఆరోపించారు. తంబళ్లపల్లెను రూ.1500 కోట్ల నిధులు ఇచ్చి అభివృద్ది చేసింది టీడీపీ అని వెల్లడించారు. దోచుకుంటుంది పెద్దిరెడ్డి కుటుంబం మాత్రమే అని దుయ్యబట్టారు. ఈ ప్రాంతంలో పరిశ్రమలు రావాలంటే పెద్దిరెడ్డి కుటుంబం వాటాలు ఇవ్వాలని అడుగుతారని.. అందుకు పరిశ్రమలు రావడం లేదని విమర్శించారు
పెద్దిరెడ్డి గత నాలుగేళ్లలో 10 వేల కోట్ల రూపాయలు దోచుకున్నారని లోకేశ్ ఆరోపించారు. త్వరలో ఆధారాలతో సహా నిరూపిస్తానని లోకేశ్ సవాల్ విసిరారు. అభివృద్దిపై తాను విసిరిన సవాల్‌కు ఎన్నికల కోడ్ అమలులో ఉన్నప్పుడు సిగ్గు లేకుండా చర్చకు వస్తామంటూ ప్రకటన చేశారని విమర్శించారు. గతంలో జగన్ వల్ల ఐఎఎస్‌లు జైలుకి వెళ్ళారని.. ఈసారి ఆయనతో పాటు ఐపీఎస్ అధికారులు జైలుకి తీసుకెళ్లబోతున్నాడని ఎద్దేవా చేశాడు. విజయానికి దగ్గర దారులు ఉండవని... యువత కష్టపడితేనే విజయం సాధ్యమని లోకేశ్ పేర్కొన్నారు. టీడీపీ వేసిన సీసీ రోడ్ల మీదే వైసీపీ వాళ్లు గడప గడపకు కార్యక్రమం చేస్తున్నారని తెలిపారు. జగన్ రెడ్డి బెయిల్ తీసుకుని బ్రతికే బ్యాచ్ అని... ఇప్పటికీ బెయిల్ పైనే బ్రతుకుతున్నారని లోకేశ్ ఎద్దేవా చేశారు.
ఇవీ చదవండి: