ప్రత్యర్థుల బెదిరింపుల కారణంగా పుర ఎన్నికల్లో నామినేషన్లు వేయలేకపోయిన వారికి రాష్ట్ర ఎన్నికల సంఘం మరో అవకాశం కల్పించినా స్పందన అంతంతమాత్రంగానే కనిపించింది. కలెక్టర్లు పంపిన నివేదికలపై ఎన్నికల సంఘం చిత్తూరు, కడప జిల్లాల్లో 14 డివిజన్లు / వార్డులకు మళ్లీ నామినేషన్లు వేసేలా సడలింపు ఇచ్చిన విషయం తెలిసిందే.
తిరుపతి నగరపాలక సంస్థలో 6 డివిజన్లు, పుంగనూరు మున్సిపాలిటీలో 3, కడప జిల్లా రాయచోటిలో 2 వార్డుల్లో మరోసారి నామినేషన్లు వేసేందుకు 11 మందికి ఎస్‌ఈసీ అనుమతించింది. యర్రగుంట్లపాలెం నగర పంచాయతీలో 3 వార్డుల్లో హరిప్రసాద్‌రెడ్డి, రెహంతుల్లా, దివ్యధారిణి సమర్పించిన నామపత్రాలను పునరుద్ధరించాలని నిర్ణయించింది. తిరుపతి, పుంగనూరు, రాయచోటిలో నిర్దేశిత గడువు.. మంగళవారం మధ్యాహ్నం 3 గంటల్లోపు 4 నామినేషన్లు దాఖలయ్యాయి.
తిరుపతిలో 2, 21, 45 డివిజన్లలో డి.విమల, ఎ.మునిమ్మ, ఎ.చంద్రమోహన్ ముందుకువచ్చారు. 8, 10, 41 డివిజన్లలో సదాశివ, శ్రావణ, సూర్యకుమారికి ఎస్‌ఈసీ వీలు కల్పించినా.. వారెవరూ ఆసక్తి చూపలేదు. పుంగనూరులో 9, 14, 28 వార్డుల్లో మున్ని, గీతమ్మ, చంద్రకళకు వెసులుబాటు కల్పించినా వారు ఇళ్ల నుంచి బయటకు రాలేదు. ఇక్కడ మొత్తం 31 వార్డుల్లో మరోసారి నామినేషన్లకు అవకాశం ఇవ్వాలని ఎస్‌ఈసీని కోరితే మూడు వార్డుల్లోనే అనుమతించిందని విపక్షాలు పేర్కొన్నాయి.
మొత్తంగా పుంగనూరులో 16 వార్డుల్లో ఒక్కోటి చొప్పున నామినేషన్లు దాఖలయ్యాయి. రాయచోటిలో 20వ వార్డుకు కె.వెంకటచలపతి నామినేషన్ వేశారు. ఒకటో వార్డులో అబ్దుల్ రెహ్మాన్‌కు అనుమతించినా ముందుకు రాలేదు. ప్రత్యేక పరిస్థితుల్లో ఎస్‌ఈసీ ఇచ్చిన గడువు ముగిసిందని, నామినేషన్లు వేసిన వారు బుధవారం మధ్యాహ్నం 3 గంటల్లోపు ఉపసంహరించుకోవచ్చని అధికారులు తెలిపారు.
ఇదీ చదవండి:
ప్రత్యర్థులకు కంట పడకుండా.. రహస్య ప్రదేశాలకు తెదేపా అభ్యర్థులు!