తిరుపతి ఎస్వీ జూ పార్క్‌ను అంతర్జాతీయ ప్రమాణాలతో అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తానని రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి స్పష్టం చేశారు. చంద్రగిరి ఎమ్మెల్యే డాక్టర్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డితో కలిసి ఆయన జూ పార్క్‌ను సందర్శించారు. ఈ సందర్భంగా జూ పార్క్ అభివృద్ధికి సంబంధించి పలు అంశాలపై విజయసాయి రెడ్డి అధికారులతో చర్చించారు. జూ పార్కులోని జంతువులు, పక్షులను దత్తత తీసుకునే పథకం అమలు చేయాలని కోరారు. తాను కూడా జూలోని ఓ జంతువును దత్తత తీసుకుంటానని తెలిపారు.
జూ పార్కు అభివృద్ధికి సంబంధించి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డితో చర్చిస్తానని వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి అవసరమైన నిధుల విడుదలకు కృషి చేస్తానన్నారు. జూ పార్కును పర్యాటకంగా.. వీక్షకులకు మరింత ఆహ్లాదకరంగా, ఆనందాన్ని కలిగించే విధంగా తీర్చిదిద్దేందుకు నా వంతు బాధ్యతగా కృషి చేస్తానన్నారు.