రాజధాని ఎక్కడ ఉండాలనే అంశంలో రాష్ట్ర ప్రభుత్వానిదే తుది నిర్ణయమని... కేంద్రానికి సంబంధం లేదని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి స్పష్టం చేశారు. సీఎం ఆలోచిస్తున్న 3 రాజధానుల అంశం ద్వారా పరిపాలన సులువవుతుందన్నారు. తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లో సచివాలయం, శాసనసభ అన్నీ కలిపి కేవలం 200 ఎకరాలే ఉన్నాయన్న మంత్రి... అమరావతిలో 33వేల ఎకరాలెందుకు అని ప్రశ్నించారు. రాజధాని ప్రాంతంలో రైతుల దగ్గర నుంచి గత ప్రభుత్వం బలవంతంగా భూములు లాక్కుందని... వాటిని తిరిగి ఇచ్చేస్తామని స్పష్టం చేశారు.
తమ పార్టీ సభ్యులూ వారి అభిప్రాయాలు ధైర్యంగా చెప్పవచ్చన్న పెద్దిరెడ్డి... రాజధానిపై భిన్నాభిప్రాయాలు రావడం సహజమన్నారు. రాయలసీమలో హైకోర్టు వస్తే ఆ ప్రాంతానికి మేలు జరుగుతుందని పేర్కొన్నారు. రాజధాని రైతులకు ఎలాంటి ఇబ్బందులు రావని ఆయన హామీ ఇచ్చారు. రాజధానికి 33 వేల ఎకరాలు ఎందుకు? అన్న మంత్రి... విశాఖ అభివృద్ధి చెందిన నగరం.. అక్కడ కొనేందుకు భూమే లేదని తెలిపారు. భూములు కొన్నవాళ్లలో ఒకే పార్టీ, సామాజికవర్గం వాళ్లే ఎక్కువ ఉన్నారని అన్నారు. రాజధాని కోసం ధర్నా చేస్తున్న వారంతా తెదేపా కార్యకర్తలేనని.. రైతులు కాదని తేల్చేశారు.
ఇవీ చదవండి: