పూతలపట్టు- నాయుడు పేట జాతీయరహదారిపై రామచంద్రాపురం జంక్షన్ వద్ద బుధవారం పోలీసులు తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో భాగంగా పనసకాయలను రవాణా చేస్తున్న ఓ లారీని నిలిపేందుకు ప్రయత్నించారు. ఆ లారీ డ్రైవర్ వాహనాన్ని ఆపకుండా వెళ్లిపోయేందుకు ప్రయత్నించటంతో పోలీసులు వెంబడించి పట్టుకున్నారు. దీంతో పనసకాయల రవాణా మాటున సాగిస్తున్న గంజాయి అక్రమ రవాణా బట్టబయలైంది.
పనసకాయల మాటున 36 సంచుల్లో ఉన్న 1064 కేజీల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. డ్రైవర్ సమాచారం మేరకు లారీకి పైలట్‌గా ఉన్న స్విఫ్ట్ కారులో ప్రయాణిస్తున్న 5 గురిని అదుపులోకి తీసుకున్నారు. వీరిలో ఓ మహిళ ఉండటం విశేషం. పోలీసుల విచారణలో వీరంతా గంజాయిని ఒడిశా నుంచి చిత్తూరు జిల్లా పూతలపట్టుకు రవాణా చేస్తున్నట్లు పోలీసులు సమాచారం రాబట్టారు.
పట్టుకున్న సరకు విలువ సుమారు కోటి రూపాయలు ఉంటుందని అంచనావేశారు. మొత్తం ఈ కేసులో ఏడుగురిని అరెస్ట్ చేసిన పోలీసులు....వారిని మీడియా ముందు ప్రవేశపెట్టారు. లారీ, కారు సీజ్ చేయటంతో పాటు....వీరు తప్పించుకునేందుకు వీలు లేకుండా కేసులు నమోదు చేస్తున్నట్లు తిరుపతి అర్బన్ ఎస్పీ రమేష్ రెడ్డి తెలిపారు.