చిత్తూరు జిల్లాలో కరోనా కోరలు చాస్తోంది. ఒకవైపు పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతుండగా.. మరణాలూ అదే స్థాయిలో నమోదవుతున్నాయి. కరోనా తొలి వేవ్‌లో ఆసుపత్రుల్లో చేరిన వ్యక్తులకు పెద్దగా ఆక్సిజన్ ఇచ్చే పరిస్థితి లేకుండానే కోలుకున్నారు. ఐసీయూ, వెంటిలేటర్‌పై ఉంచి.. చికిత్స అందించే వారి సంఖ్య నామమాత్రంగానే ఉంది. అధిక శాతం సందర్భాల్లో వారం, 10 రోజుల తర్వాత మాత్రమే బాధితులు మృతి చెందిన సందర్భాలున్నాయి. ప్రస్తుతం పరిస్థితి మారింది.. ఆసుపత్రుల వద్దకు వచ్చేసరికే కొందరికి రక్తంలో ఆక్సిజన్ శాతం 60- 90 వరకు ఉంటోంది. ఫలితంగా శ్వాస తీసుకోవడంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వీరికి వెంటనే ఆక్సిజన్ అందించి.. అనంతరం కుటుంబ సభ్యుల నుంచి వివరాలు నమోదు చేసుకునే పరిస్థితి ఉంది. దీంతో ఆక్సిజన్, ఐసీయూ పడకలకు డిమాండ్ పెరిగింది. వైద్యశాలలో చేరిన మూడు నాలుగు రోజులకే బాధితులు మృతి చెందుతున్నారని వైద్యులు పేర్కొంటున్నారు. ఆసుపత్రిలో చేరే నాటికే ఊపిరితిత్తులు దెబ్బతింటుండటంతోనే ఈ పరిస్థితి తలెత్తుతోందని వారు చెబుతున్నారు. కరోనా మృతుల్లో పురుషులే ఎక్కువగా ఉంటున్నారు. మొత్తం మరణాల్లో ఈ శాతం 72.59గా ఉంది.
పురుషులే ఎక్కువగా చేరుతున్నారు
కరోనా బారిన పడుతున్న వారిలో అధిక శాతం మంది పురుషులే ఉంటున్నారు. బయట ఎక్కువగా తిరుగుతుండటంతో వారికి వైరస్ త్వరగా సోకుతోంది. మద్యపానం, ధూమపానం, గుట్కా వంటి అలవాట్లు కూడా ఓ కారణంగా చెప్పొచ్ఛు వీటి మూలంగా ఊపిరితిత్తులు దెబ్బతింటుండటంతో కొందరు ప్రాణాలు కోల్పోతున్నారు. మహిళలు పెద్దగా బయటకు రాకపోతుండటంతో వైరస్ బారిన పడటంలేదు. ఒకవేళ పాజిటివ్‌గా నిర్ధరణ అయినా దురలవాట్లు లేకపోవడంతో మరణాల శాతమూ తక్కువగా ఉంది. - డాక్టర్ వెంగమ్మ, స్విమ్స్ సంచాలకులు
30 శాతం మంది 61- 70 ఏళ్ల లోపు వారే
గతేడాది మార్చి నుంచి ఈ ఏడాది మే 4 వరకు జిల్లావ్యాప్తంగా 1,007 మంది కరోనాతో మృత్యువాత పడ్డట్టు జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ పేర్కొంది. ఇందులో 61- 70 ఏళ్ల లోపు వారే అత్యధికంగా 302 మంది ఉన్నారు. ఈ శాతం సుమారు 30గా ఉంది. 302 మందిలో ఏకంగా 217 మంది పురుషులే కావడం గమనార్హం. 51- 60 ఏళ్లలోపు వ్యక్తులు 274 మంది మృత్యువాత పడ్డారు. 0- 30 ఏళ్ల లోపు వ్యక్తులకు కరోనా సోకినా.. మరణాల శాతం తక్కువగానే ఉంది. జిల్లాలో వీరి మరణాల సంఖ్య 22గా ఉంది. ఇటీవల కాలంలోనే ఇవి కూడా అధికంగా చోటుచేసుకుంటున్నాయని వైద్య, ఆరోగ్యశాఖ అధికారులు అభిప్రాయపడుతున్నారు.
బయట తిరుగుతుండటంతోనే..
పురుషులు ఎక్కువగా బయట తిరుగుతుండటం, మద్యపానం కారణంగా కరోనా బారిన పడుతున్నారని వైద్యులు పేర్కొంటున్నారు.ఈ క్రమంలోనే మరణాలూ పెరుగుతున్నాయి. కొందరికి కరోనా అనుమానిత లక్షణాలు కనిపించినా.. పరీక్షలు చేయించుకోకుండా బయట తిరుగుతున్నారు. ఒకవేళ వచ్చినా పెద్దగా ప్రమాదకరం కాదనే భావనతో ఉండటంతో ఈ పరిస్థితి తలెత్తుతోంది. మరికొందరు ఔషధ దుకాణాల వద్దకు వెళ్లి.. మందులు తీసుకొని వేసుకుంటున్నారు. చివరకు శ్వాస తీసుకోవడం కష్టమైన తరుణంలో హడావుడిగా ఆసుపత్రులకు వెళుతున్నారు. వైద్యశాలకు వెళ్లేటప్పటికి కొందరిలో రక్తంలో ఆక్సిజన్ శాతం 60గా ఉంటోందని వైద్యులు చెబుతున్నారు. అధిక శాతం మంది చికిత్సకు స్పందించి కోలుకుంటుండగా.. మరికొందరు మాత్రం రెండు మూడు రోజులకే మరణిస్తున్నారు. లక్షణాలు కనిపించిన వెంటనే పరీక్షలు చేయించుకొని.. చికిత్స తీసుకుంటే ప్రయోజం ఉంటుందని వైద్యులు సూచిస్తున్నారు.
ఇదీ చదవండీ..21 అనాథ మృతదేహాలకు ఎమ్మెల్యే దహన సంస్కారాలు