తిరుమల భూ వరాహస్వామి వారి ఆలయంలో బాలాలయ మహాసంప్రోక్షణ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. గర్భాలయంలో జీర్ణోద్ధారణ కోసం డిసెంబరు 6 నుంచి 10 వరకు ఈ క్రతువును జరపాలని తితిదే నిర్ణయించింది. డిసెంబరు 5 రాత్రి జరిగే అంకురార్పణతో కార్యక్రమం ప్రారంభం కానుంది. ఈ సమయంలోనే స్వామి వారి ఆలయ విమాన ప్రాకారానికి బంగారు పూతపూసిన రాగి రేకులు అమర్చాలని తితిదే నిర్ణయించింది. దాత ఇచ్చిన రూ.14 కోట్ల విరాళంతో 42కిలోల బంగారం.. 1800 కిలోల రాగిని తాపడానికి ఉపయోగిస్తారు.
తాపడానికి ఆరునెలల సమయం పట్టే అవకాశం ఉండటంతో.. మూలమూర్తుల దర్శనానికి వీలుండదు. ఆలయ ముఖ మండపంలో నమూనా ఆలయాన్ని ఏర్పాటు చేసి గర్భాలయం తరహాలోనే చెక్కతో విగ్రహాలను ఏర్పాటు చేయనున్నారు. అక్కడే నిత్యకైంకర్యాలను నిర్వహిస్తారు. ఆలయంలోని యాగశాలలో ఐదు రోజుల పాటు ప్రత్యేక కార్యక్రమాలను చేపట్టనున్నారు. డిసెంబరు 10వ తేదీ ఉదయం 9 నుంచి 10.30 గంటల సమయంలో బాలాలయ మహాసంప్రోక్షణను నిర్వహించనున్నారు. 12ఏళ్లకో సారి నిర్వహించే బాలాలయ మహాసంప్రోక్షణ కార్యక్రమాన్ని గతేడాదే చేపట్టినా.. బంగారు తాపడానికి దాత ముందుకు రావటంతో మరోసారి ఈ క్రతువును నిర్వహిస్తున్నారు.
ఇదీ చదవండి: పిల్లలకు రక్షణ కవచాలుగా మారిన చీరలు...