మహాశివరాత్రిని పురస్కరించుకొని చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి ఆలయంలో ఇంద్ర విమానం, చక్ర వాహన సేవను కన్నుల పండువగా జరిపించారు. సోమస్కంధ మూర్తి సమేత జ్ఞానప్రసూనాంబ దేవి ఇంద్ర విమానం, చక్రంపై కొలువుదీరి భక్తులకు దర్శనమిచ్చారు. అలంకార మండపం నుంచి బయలుదేరిన ఆదిదంపతులు మాడవీధుల్లో ఊరేగారు. ఉత్సవ మూర్తులకు వృషభం, అశ్వం, భక్తుల కోలాటాలతో ఘనంగా స్వాగతం పలికారు. ఈ విశేష ఉత్సవాన్ని చూసేందుకు అధిక సంఖ్యలో భక్తులు తరలిరావటంతో శ్రీకాళహస్తి భక్తజన సంద్రంగా మారింది.
అమరనాథ్ శివలింగ దర్శనం..
తిరుపతిలో బ్రహ్మకుమారీస్ ఈశ్వరీయ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన.. అమరనాథ్ శివలింగ దర్శనం.. ఆద్యంతం భక్తులను విశేషంగా ఆకట్టుకుంటుంది. సాక్షాత్తు ఆ అమర్‌నాథుడి ఆలయాన్ని తలపిస్తోంది. ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటైన అమరనాథుడి ఆలయ నమూనాన్ని రూపొందించిన నిర్వహకులు.. మంచు రూపంలోని లింగాకృతిని తీర్చిదిద్దారు. శివరాత్రిని పురస్కరించుకుని .. భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి ముక్కంటిని దర్శించుకొని తరిస్తున్నారు.
ఇవీ చూడండి...