Lack of Infrastructure in Industrial Corridors: ఒక్క పెట్టుబడుల సదస్సుతో లక్షల కోట్ల రూపాయల ఒప్పందాలు జరిగాయని గొప్పగా చెప్పుకొనే రాష్ట్ర ప్రభుత్వం.. పారిశ్రామికవాడల్లో మౌలిక వసతుల కల్పనకు చిల్లిగవ్వ విదల్చడం లేదు. దీనివల్ల పరిశ్రమల ఏర్పాటుకు గత ప్రభుత్వాలు సేకరించిన వేల ఎకరాల భూములు నిరుపయోగంగా మారాయి. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో పీలేరు, నగరి, శ్రీకాళహస్తి, సత్యవేడు, నెల్లూరు జిల్లా వెంకటగిరి, గూడూరు నియోజకవర్గాల్లోని ఏపీఐఐసీ భూముల పరిస్థితీ అదే.
నాయుడుపేట క్లస్టర్ ప్రత్యేక ఆర్థిక మండలిలో 2వేల 549 ఎకరాలు, పారిశ్రామిక పార్కులో 12వందల 44 ఎకరాలు, పీలేరు సమీపంలో 750 ఎకరాలు, తాటిగుంటపల్లె వద్ద 13 వందల ఎకరాల భూమిని పరిశ్రమల అభివృద్ధికి సేకరించారు. ఈ భూముల్లో మౌలిక వసతుల కల్పనకు వైసీపీ ప్రభుత్వం రూపాయి కూడా వెచ్చించలేదు. దీంతో వందల ఎకరాలు ఏపీఐఐసీ భూములు నిరుపయోగంగా ఉన్నాయి.
రాయలసీమ ప్రాంతంలో నిరుద్యోగ సమస్యను అధిగమించేందుకు గత ప్రభుత్వం రూపొందించిన ప్రణాళికలు.. వైసీపీ అధికారంలోకి వచ్చాక అటకెక్కాయి. పరిశ్రమలు వస్తే బిడ్డల భవిష్యత్తు బాగుంటుందని వందలాది మంది రైతులు పారిశ్రామిక వాడలకు భూములిచ్చారు. మౌలిక వసతుల కల్పించకపోవడం, ప్రభుత్వం నుంచి ఎలాంటి సహకారం లేకపోవడంతో ఎక్కడా పరిశ్రమలు ఏర్పాటు కాలేదు సరికదా.. తాటిగుంటపల్లె పారిశ్రామికవాడ నుంచి అరవింద్ టెక్స్‌టైల్స్ లాంటి సంస్థలు వెనక్కి వెళ్లిపోయాయి.
పరిశ్రమలు ఏర్పాటైతే ఇంటికో ఉద్యోగం వస్తుందని ఆశించామని… వైసీపీ అధికారంలోకి వచ్చాక ఒక్క పరిశ్రమ ఏర్పాటు కాలేదని భూములు కోల్పోయిన రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పరిశ్రమలు ఏర్పాటు చేయకపోతే భూములు తిరిగి ఇచ్చేయాలని.. భూములు సాగుచేసుకుని బతుకుతామని రైతులు కోరుతున్నారు.
"ఇక్కడ కరెంటు సమస్య ఉంది. రోడ్లు లేవు. వాటర్ లేవు. ఇవన్నీ కల్పిస్తే.. ఇక్కడ పరిశ్రమలు ఏర్పాటు చేసుకుంటాం. అదే విధంగా కొంత మందికి ఉద్యోగాలు ఇచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఇక్కడ అభివృద్ధి చేయాలని కోరుకుంటున్నాం". - పారిశ్రామికవేత్తలు
"మేమంతా చిన్న తరహా పరిశ్రమలు ఏర్పాటు చేయడానికి సిద్ధంగా ఉన్నాము. కానీ ఇక్కడ మౌలికసదుపాయాలు లేవు. ముఖ్యంగా కాలువలు, సిమెంటు రోడ్లు, నీళ్లు, కరెంటు లేవు. ఇవి ఉంటే మేము పరిశ్రమలు ఏర్పాటు చేసి.. కొంతమందికి ఉద్యోగాలు ఇవ్వడానికి కూడా సిద్ధంగా ఉన్నాము". - పారిశ్రామికవేత్తలు
"మాకు ఏడు ఎకరాల పొలం ఉండేది. ఇంటికో ఉద్యోగం ఇస్తామన్నారు. అప్పట్లో కొంత అభివృద్ధి చేశారు. కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తరువాత అసలు ఏం చేయలేదు. ఉద్యోగాలు కూడా లేవు". - రైతులు
ఇవీ చదవండి: