తెలుగుదేశం అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రాతినిథ్యం వహిస్తున్న కుప్పంలో పురపాలక ఎన్నికలు రాష్ట్ర వ్యాప్తంగా ఆసక్తిని రేపుతున్నాయి. ఎన్నికల నోటిఫికేషన్‌కు ముందే మూడ్రోజులు కుప్పంలో పర్యటించిన చంద్రబాబు పాదయాత్రలు, రోడ్ షోలు, సమావేశాలతో శ్రేణుల్లో జోష్ నింపారు. పురపాలక సంఘం పరిధిలోని గ్రామాలతో పాటు పట్టణంలోని కాలనీల్లో ప్రచారం నిర్వహించారు. తొలిసారి జరుగుతున్న కుప్పం పురపాలకిపై తెలుగుదేశం జెండా ఎగురవేయాలని నేతలకు దిశానిర్దేశం చేశారు. రెండున్నరేళ్ల వైకాపా పాలనతో విసిగిపోయిన ప్రజలు తమకు పట్టం కడతారని తెలుగుదేశం నేతలు విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు.
కుప్పం పురపాలక ఎన్నికను అధికారపక్షం సైతం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. చంద్రబాబు సొంత నియోజకవర్గంలో గెలుపొంది రాజకీయంగా ఆయన్ను మరింత ఇబ్బందికి గురిచేసేలా పావులు కదుపుతోంది. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డితోపాటు చిత్తూరు జిల్లాకు చెందిన వైకాపా నేతలు ప్రత్యక్షంగా ఈ ఎన్నికలను పర్యవేక్షిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి పథకాల లబ్ధిదారుల అభినందన సభల పేరుతో పలు సమావేశాలు నిర్వహించారు. వైఎస్సార్ ఆసరా లబ్ధిదారులతో రాజంపేట ఎంపీ మిథున్‌రెడ్డి ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి, జిల్లా శాసనసభ్యులు కుప్పం పట్టణంలో తరచూ పర్యటిస్తు వైకాపా తరపున ప్రచారం చేపట్టారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలే తమ గెలుపునకు దోహదపడతాయని వైకాపా నేతలు దీమా వ్యక్తం చేస్తున్నారు.
ప్రముఖుల పర్యటనలతో కుప్పం పురపాలక పోరు ఆసక్తికరంగా సాగుతోంది. నామినేషన్ల సమయంలో చోటు చేసుకొన్న ఘటనలకు తోడు...ప్రచారంలో తెదేపా అధినేత చంద్రబాబుపై వైకాపా నేతల దూషణల పర్వం ఎన్నికల వేడిని మరింత రాజేసింది.
ఇదీ చదవండి: