కలియుగంలో వేంకటాద్రిని మించిన పుణ్యధామం బ్రహ్మాండంలోనే లేదు. కలియుగాధిపతిగా... శేషాచల నివాసిగా... ఏడుకొండల వెంకన్నగా పూజలందుకుంటున్న శ్రీ వేంకటేశ్వరుని సాలకట్ల బ్రహ్మోత్సవాలు నేటి నుంచి మొదలుకానున్నాయి. గోవిందా అని తలచిన వెంటనే నేనున్నానంటూ పలికి... భక్తుల కోర్కెలు తీర్చే కోనేటి రాయుడిని బ్రహ్మోత్సవ వేళ కనులారా వీక్షించాల్సిందేందుకు భక్తులు పోటెత్తనున్నారు.
దేశ, విదేశాల నుంచి లక్షలాదిగా తరలివచ్చే భక్త జన సందోహంతో తిరుగిరులు తొమ్మిది రోజుల పాటు కిక్కిరిసిపోనున్నాయి. స్వామి వారికి అత్యంత వైభవంగా జరిగే బ్రహ్మోత్సవాలను దృష్టిలో ఉంచుకుని అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ప్రముఖులు, అత్యంత ప్రముఖులను తోసిరాజంటూ... సామాన్యునికి బ్రహ్మాండనాయకుని సాక్షాత్కరమే ప్రథమ ప్రాధాన్యంగా ఈ సారి బ్రహ్మోత్సావాలను నిర్వహించనున్నట్లు తితిదే అధికారులు ఇప్పటికే స్పష్టం చేశారు.
మీన లగ్న శుభముహూర్తాన సాయంత్రం 5.23 నిమిషాలకు ధ్వజారోహణ ప్రారంభం కానుంది. అనంతరం స్వామి వారికి పెద్దశేష వాహన సేవ జరగనుంది. రాత్రి 8 గంటలకు ప్రారంభమయ్యే ఈ సేవ 10 గంటలవరకు నిర్వహించనున్నారు. ఏడు పడగల శేషుడిపై... శ్రీదేవి భూదేవీ సమేతుడైన మలయప్పస్వామి కొలువు తీరి... మాడవీధుల్లో విహరిస్తూ భక్తులకు అభయప్రదానం చేయనున్నారు. తిరువాభరణములు ధరించి పెద్దశేషవాహనుడిపై ఉభయదేవేరుల సమేతుడైన మలయప్పస్వామిని దర్శిస్తే సర్వపాపాలు తొలగిపోతాయనేది ప్రశస్తి.
స్వామి వారి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని అన్ని ఆర్జిత సేవలను తితిదే రద్దు చేసింది. బ్రేక్ దర్శనాలను, చిన్నపిల్లల తల్లుల, వృద్ధులకోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్శనాలను తితిదే రద్దు చేసింది. ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా... అన్ని శాఖల అధికారులను సమన్వయం చేసుకుంటూ బ్రహ్మోత్సవాలను దిగ్విజయం చేసేలా అన్ని ఏర్పాట్లు చేసినట్లు తితిదే అధికారులు స్పష్టం చేశారు.
ఇదీ చదవండీ... నేడు చిత్తూరు జిల్లాలో సీఎం జగన్ పర్యటన