తన సోదరుడిపై జరిగిన దాడి కేసులో పోలీసులు తీరు చూస్తుంటే జాలేస్తోందని న్యాయమూర్తి రామకృష్ణ అన్నారు. చిత్తూరు జిల్లా ఎస్పీ సెంథిల్ కుమార్ చెబుతున్న విషయాలకు, వాస్తవాలకు పొంతన లేదని... డీజీపీ ప్రకటన మరింత హాస్యాస్పదంగా ఉందన్నారు. దాడి జరిగిన రోజు అక్కడే ఉన్న ఎస్పీ అప్పుడే ఎందుకు స్పందించలేదు? అని ప్రశ్నించారు. రాడ్లతో కొట్టినట్లు సీసీ ఫుటేజీలో కనపించడంలేదని ఎస్పీ చేస్తున్న వ్యాఖ్యలను రామకృష్ణ తప్పుపట్టారు. దాడి చేసినవారు ఏ పార్టీ వారైనా.. అరెస్టు చేసి శిక్షించాలని కోరారు. ఎస్పీ వ్యాఖ్యలు అతనిపై న్యాయస్థానంలో వ్యాజ్యం వేసేందుకు అవకాశం కల్పించాయని న్యాయమూర్తి రామకృష్ణ అన్నారు.
వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాది ఎనిమిది నెలల కాలంలో దళితులపై పెద్ద సంఖ్యలో దాడులు జరిగాయని హైకోర్టు న్యాయవాది, జైభీమ్ యాక్సెస్ జస్టిస్ కన్వీనర్ శ్రావణ్‌కుమార్ అన్నారు. న్యాయమూర్తి రామకృష్ణ సోదరుడుపై మంత్రి పెద్దిరెడ్డి అనుచరులే దాడి చేశారని విమర్శించారు. రామకృష్ణ కుటుంబానికి తామంతా బాసటగా నిలిచేందుకు- రాష్ట్ర వ్యాప్తంగా దళితులపై జరుగుతున్న దాడులకు నిరసనగా అక్టోబరు రెండో తేదీన చలో మదనపల్లి కార్యక్రమం నిర్వహిస్తున్నామని చెప్పారు.
ఇదీ చదవండి: 56 శాసనసభ స్థానాలకు నవంబరులో ఉపఎన్నికలు