తిరుమలలో శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామివారికి విష్ణుసాలగ్రామ పూజను, అర్చకులు ఆగమోక్తంగా జరిపించారు. ముందుగా స్వామి, అమ్మవార్లను శ్రీవారి ఆలయం నుంచి వసంత మండపానికి తీసుకు వచ్చారు. అక్కడ శ్రీ భూవరాహస్వామి, శ్రీ ఆంజనేయస్వామివారి ప్రతిమలతో పాటు ఉసిరి, లక్ష్మీ తులసి, రామతులసి, కృష్ణతులసి.... పవిత్రమైన చెట్లను కొలువుదీర్చారు.
ముందుగా ప్రార్థనా సూక్తం, అష్టదిక్పాలక ప్రార్థన, నవగ్రహ ప్రార్థనతో విష్ణుసాలగ్రామ పూజను ప్రారంభించారు. అనంతరం పండితులు వేదమంత్రాలు పఠిస్తుండగా... అర్చకులు సాలగ్రామాలకు పాలు, పెరుగు, చందనం, పసుపు తదితర సుగంధ ద్రవ్యాలతో విశేషంగా అభిషేకం చేశారు. ఆ తరువాత ఉత్సవమూర్తులకు, సాలగ్రామాలకు హారతులు, నైవేద్యాలను సమర్పించారు. ఆఖరికి క్షమా మంత్రం, మంగళంతో పూజ ముగించారు.
సాలగ్రామాలు సాక్షాత్తు విష్ణువు అవతారమని... సాలగ్రామ పూజ వల్ల సర్వజన రక్షణ, సమస్త బాధల ఉపశమనం కలుగుతాయని వైఖానస ఆగమ సలహాదారులు మోహన రంగాచార్యులు తెలిపారు. కరోనా అంతరించాలని లోకక్షేమాన్ని కాంక్షిస్తూ నేటి నుంచి 13వ తారీఖు వరకు శ్రీమహావిష్ణువు ప్రత్యేక పూజలను తితిదే నిర్వహిస్తోంది.
ఇదీ చదవండీ...అన్నవరం దేవస్థానంలో స్వామివారికి ప్రత్యేక పూజలు