తిరుపతిలోని రుయా ఆస్పత్రిలో ఆక్సిజన్ అందక సంభవించిన మరణాలపై పూర్తి వివరాలు సమర్పించాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేసేందుకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, వైద్య ఆరోగ్య శాఖ ముఖ్యకార్యదర్శి, రుయా ఆసుపత్రి డైరెక్టర్, చిత్తూరు జిల్లా కలెక్టర్ కు నోటీసులు జారీ చేసింది. విచారణను వేసవి సెలవుల తర్వాత చేపడతామని తెలిపింది.
రుయాలో ఆక్సిజన్ కొరతతో కరోనా బాధితులు మరణించడంపై తిరుపతికి చెందిన సామాజిక సేవకుడు భానుప్రకాశ్ రెడ్డి హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. పిటిషనర్ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ... ఆక్సిజన్ అందక మొత్తం 56 మంది చనిపోయారని.. ప్రభుత్వానికి చెడ్డపేరు రాకూడదనే కేవలం 11 మంది మాత్రమే చనిపోయారని చెబుతోందని తెలిపారు. ఆ 11 మందికి మాత్రమే ప్రభుత్వం 10 లక్షల రూపాయల పరిహారం ఇచ్చిందని.. 25 లక్షలు చెల్లించాలని కోరారు. వాస్తవాలు వెలికితీసేందుకు న్యాయవిచారణ అవసరమని, రికార్డులను తారుమారు చేసే అవకాశం ఉందన్న న్యాయవాది.. వీడియో ఫుటేజీలు భద్రపరిచేలా చర్యలు తీసుకోవాలని కోరారు.
ఇదీ చదవండి:
కొవిడ్ కట్టడిలో రాష్ట్ర ప్రభుత్వం చేతులెత్తేసింది: ఎమ్మెల్యే వెలగపూడి