పుంగనూరు జాతి ఆవుల సంరక్షణ, పునరుత్పత్తి కోసం ప్రభుత్వం కార్యాచరణ ప్రారంభించింది. రూ.63.36 కోట్లతో మిషన్ పుంగనూరు రీసెర్చ్ ప్రాజెక్ట్ కు అనుమతులు జారీ చేసింది. కడప జిల్లా పులివెందులలోని ఏపీ సెంటర్ ఫర్ అడ్వాన్స్డ్ రీసెర్చ్ అండ్ లైవ్ స్టాక్ లిమిటెడ్‌కు బాధ్యతల్ని అప్పగించారు. ఐవీఎఫ్ ద్వారా పుంగనూరు ఆవుల వృద్ధి కోసం చర్యలు చేపట్టాల్సిందిగా ప్రభుత్వం ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది.
చిత్తూరు జిల్లాలోని నియోజకవర్గ కేంద్రం పుంగనూరు. పొట్టి జాతి ఆవులకు ఈ ప్రాంతం ప్రసిద్ధి. ఒంగోలు జాతి ఆవులకు మల్లే ‘పుంగనూరు’ కూడా దేశం గర్వించదగ్గ గోజాతి. ఇవి అంతరించి పోయే దశలో ఉన్నాయి. ప్రపంచంలోనే అతిపొట్టి జాతి ఆవులివి. 70–90 సెం.మీ ఎత్తు ఉంటాయి. 115–200 కిలోల బరువుంటాయి. లేత బూడిద, తెలుపు రంగులో ఉంటాయి. విశాలమైన నుదురు, చిన్న కొమ్ములు ఉంటాయి. వీటి తోకలు నేలను తాకీ తాకనట్టు ఉంటాయి. కరువు పరిస్థితులను సమర్థవంతంగా తట్టుకోవటం వల్ల గతంలో పేదవాడి ఆవులుగా పేరుపొందాయి. అచ్చం ఎండు గడ్డితిని మనుగడ సా«గించగలవు.
రోజుకు 3–8 లీటర్ల పాలు ఇస్తాయి. సాధారణంగా ఆవుపాలలో ఔషధ విలువలతో పాటు 3 నుంచి 3.5 వరకు వెన్న శాతం ఉంటుంది. అదే పుంగనూరు ఆవు పాలలో 8 శాతం ఉంటుంది. ఎస్‌ఎన్‌ఎఫ్ (సాలిడ్స్ నాట్ ఫ్యాట్) 9 శాతం ఉంటుంది. దీనివల్ల పాలకు అధిక ధర లభిస్తుంది.
ఇదీ చదవండి: స్వీయ మరణాలకు అనుమతించండి!