Amul Milk: రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అంగన్‌వాడీ కేంద్రాలకు అమూల్ ద్వారా పాలను సరఫరా చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. మొదట చిత్తూరు జిల్లా మదనపల్లె చుట్టుపక్కల ఉన్న కేంద్రాలకు సరఫరా చేయనున్నారు. రవాణా, పాల ధరపై అమూల్ ప్రతినిధులతో ఏపీ డైయిరీ చర్చిస్తోందని, ఫిబ్రవరి నుంచి సరఫరా మొదలవుతుందని మహిళా శిశు సంక్షేమశాఖ అధికారులు చెబుతున్నారు.
రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 55,607 అంగన్‌వాడీ కేంద్రాల్లో 32 లక్షల మందికి ప్రభుత్వం వైఎస్సార్ సంపూర్ణ పోషణ, పోషణ ప్లస్ కింద పోషకాహారాన్ని అందిస్తోంది. తల్లీబిడ్డలకు ప్రతినెలా పాల ప్యాకెట్లను ఇస్తున్నారు. ప్రస్తుతం కర్ణాటక మిల్క్ ఫెడరేషన్(కేఎమ్‌ఎఫ్) నుంచి పాలను రాష్ట్రవ్యాప్తంగా అంగన్‌వాడీ కేంద్రాలకు సరఫరా చేస్తున్నారు. ఇప్పుడు దశల వారీగా ఈ సరఫరాను అమూల్‌కు అప్పగించనున్నారు. ఇప్పటికే ఆ సంస్థ మదనపల్లెలో ప్లాంటును సిద్ధం చేసింది. ఇక్కడ తొలుత 70 వేల లీటర్ల పాలను కేంద్రాలకు సరఫరా చేయనున్నారు. టెట్రా ప్యాకుల్లో కాకుండా తాజా పాలను రోజువారీగా అందిస్తారని అధికారులు చెబుతున్నారు. ఆ తర్వాత కృష్ణా, పశ్చిమగోదావరి, ప్రకాశం, కడప, విశాఖ జిల్లాల్లో ప్రారంభించనున్నారు.
టెండర్లకు వెళతారా? నామినేషన్ ప్రాతిపదికనా?
ప్రస్తుతం అంగన్‌వాడీ కేంద్రాలకు 200 మి.లీ., 500/1000 మి.లీ. ప్యాకెట్లలో పాలను సరఫరా చేస్తున్నారు. పెంచిన ధరల ప్రకారం రవాణా ఛార్జీలతో కలిపి లీటరు ధర రూ.49.75ల నుంచి రూ.55.50లుగా నిర్ణయించి కేంద్రాలకు అందిస్తున్నారు. ఇప్పటివరకు మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారులు పాల ధరను నిర్ణయించి ఏపీ డెయిరీకి అప్పగిస్తే... అది కర్ణాటక మిల్క్ ఫెడరేషన్‌తో ఒప్పందం చేసుకుని పాలను సరఫరా చేస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా అంగన్‌వాడీ కేంద్రాలకు నెలకు సుమారు కోటి లీటర్ల వరకు పాలు అవసరమవుతాయి. వీటి సరఫరాకు ఏడాదికి సుమారు రూ.500 కోట్ల వరకు ప్రభుత్వమే ఖర్చు చేయనుంది. ప్రభుత్వ నిబంధనల మేరకు ప్రాజెక్టు విలువ రూ.100 కోట్లు దాటితే టెండర్ల నిర్వహించడంతోపాటు రివర్స్ టెండర్లకు కూడా వెళ్లాల్సి ఉంది. అయితే ఈ ప్రాజెక్టును దశల వారీగా అమూల్‌కు అప్పగించనున్న నేపథ్యంలో టెండర్ల నిర్వహిస్తారా? లేదా నామినేషన్ ప్రాతిపదికనే అప్పగిస్తారా? అనేది తేలాల్సి ఉంది.
ఇదీ చూడండి:
SNAKE IN MP HOUSE: ఎంపీ కింజరాపు రామ్మోహన్ నాయుడు నివాసంలో రక్తపింజర పాము