తిరుపతి గ్రామీణ మండలం కుంట్రపాకం రెవెన్యూ లెక్కదాఖలు సర్వే నం.612లో సిద్ధేశ్వర కొండ ఉంది. దాని చుట్టూ ప్రైవేటు భూములు ఉన్నాయి. వీటి నుంచి కొందరు నేరుగా కొండ వద్దకు చేరుకుని మట్టిని తరలిస్తున్నారు. తిరుపతి నగర పరిసర ప్రాంతాల్లో మట్టి ట్రాక్టర్ ధర రూ.వెయ్యి, లారీ ధర రూ.5 వేల వరకు ఉంది. ఇక్కడ లభించే మట్టి నాణ్యమైంది కావడంతో ఎక్కువ మంది కొనుగోలుకు ఆసక్తి చూపుతున్నారు.
సరిహద్దు సమస్య
కొండ ప్రాంతం ఒకవైపు తిరుపతి గ్రామీణ మండలం, మరోవైపు రామచంద్రాపురం మండలానికి చెందిన భూభాగం ఉండటంతో సరిహద్దు సమస్యగా మారింది. దీనిపై ఎవరైనా ఫిర్యాదు చేస్తే రెండు మండలాలకు చెందిన రెవెన్యూ అధికారులు తమ పరిధి కాదంటూ సమాధానం చెప్పడం అక్రమార్కులకు కలిసొస్తోంది. ఇరువైపులా తవ్వకాల కారణంగా కొండ స్వరూపమే మారిపోయింది.
భారీఎత్తున..
రెండేళ్లుగా సర్వే నం.612, కోదండరామాపురం పరిధిలోని సిద్ధేశ్వరకొండ, కుంట్రపాకంలోని ఎగువ చెరువు ప్రాంతాల్లో కొండను తవ్వి మట్టిని భారీ ఎత్తున తరలించారు. ఆయా గ్రామాలకు చెందిన అధికార పార్టీ ప్రముఖుల సహకారంతో అక్రమం సాగుతున్నట్లు సమాచారం. ఎవరైనా ప్రశ్నిస్తే దాడులకు దిగుతున్నారు. రోజుకు సగటున సుమారు రూ.50 వేల విలువైన మట్టిని ట్రాక్టర్లు, ట్రక్కుల ద్వారా తరలిస్తున్నారు. ఇలా రెండేళ్ల కాలంలో రూ.దాదాపు మూడు కోట్ల విలువైన మట్టిని తరలించినట్లు స్థానికులు చెబుతున్నారు. ఇటీవల కాలంలో దీనిపై స్థానికుల నుంచి వ్యతిరేకత రావడంతో కొంతకాలం నిలిపేశారు.మళ్లీ అక్రమ రవాణా ఎక్కువైంది. రాత్రి వేళ్లలో తరలింపు ఎక్కువగా జరుతున్నట్లు స్థానికులు తెలిపారు. రెవెన్యూ అధికారులు అడ్డుకోకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇకనైనా ఉన్నతాధికారులు స్పందించి గ్రావెల్ తవ్వకాలు అడ్డుకోవాలని స్థానికులు కోరుతున్నారు.
అక్రమ రవాణా అడ్డుకుంటాం
సిిద్ధేశ్వర కొండ పరిసర ప్రాంతాల్లో తవ్వకాలు జరిగినట్లు ఫిర్యాదు అందలేదు. ఎవరైనా అక్రమంగా మట్టి తవ్వుతున్నట్లు తేలితే కఠిన చర్యలు తీసుకుంటాం. సంబంధిత వీఆర్వోను తవ్వకాలు జరిగిన ప్రాంతాలకు వెంటనే పంపుతా. అనుమతులు లేకుండా ప్రభుత్వానికి చెందిన ప్రాంతాల్లో తవ్వకాలు చేపట్టడం చట్టరీత్యా నేరం. - లోకేశ్వరి, తహసీల్దార్, తిరుపతి గ్రామీణ
ఇదీ చూడండి: RAYALASEEMA LIFT: ఏపీ సీఎస్ తప్పుదోవ పట్టించేలా అఫిడవిట్లు వేశారు..