ప్రభుత్వ భూములను తమ కుటుంబ సభ్యుల పేరు మీద మార్చుకొని(LAND SCAM) సీఐడీ విచారణ ఎదుర్కొంటున్న రమణ తెదేపా నేత అని ఉపముఖ్యమంత్రి నారాయణస్వామి(deputy cm narayana swami on land scam) ఆరోపించారు. తెదేపా హయాంలో జరిగిన భూ కబ్జాలపై పూర్తిస్థాయి విచారణ జరిపిస్తామని.. జిల్లాలో పదిహేను ఎకరాల అటవీ భూములను తెదేపా నేతలు కబ్జా చేశారని విమర్శించారు. తెదేపా నేతల భూ కబ్జాలపై స్పష్టమైన ఆధారాలు ఉన్నాయన్నారు. రమణ తరహాలోనే చాలా మంది తెదేపా నేతలు కబ్జాలకు పాల్పడ్డారని.. త్వరలోనే విచారణలో అసలు వాస్తవాలు వెలుగులోకి వస్తాయని తీసుకొస్తామన్నారు. నిందితులపై క్రిమినల్ కేసులు పెట్టి అరెస్టు చేస్తామన్నారు. తెదేపా నేతలపై పెడుతున్న క్రిమినల్ కేసులు కక్షసాధింపు కాదని మంత్రి స్పష్టం చేశారు. తెదేపా నేతల భూకబ్జాపై చంద్రబాబు వెంటనే సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
అసలు ఏం జరిగిందంటే..
రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన చిత్తూరు జిల్లా భారీ భూ కుంభకోణం కేసులో సరికొత్త అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. జిల్లాలోని 13 మండలాల్లో దాదాపు 2వేల 320 ఎకరాల భూములను తమ కుటుంబ సభ్యుల పేరుమీద మార్చుకొని రెవెన్యూ అధికారులకు దొరికిన వీఆర్వో గణేష్‌పిళ్లై…పలు అక్రమాలకు పాల్పడినట్లు సీఐడీ గుర్తించింది. 2005లో రెవెన్యూ దస్త్రాల కంప్యూటరీకరణ సమయంలో భూ కుంభకోణానికి తెరలేపినట్లు తేలింది.
గణేశ్ పిళ్లై వెబ్‌ల్యాండ్ ప్రారంభ సమయంలోనే కుటుంబ సభ్యుల పేర్ల మీదకు ప్రభుత్వ భూములను మార్చుకున్నారు. మీసేవ, వెబ్‌ల్యాండ్‌లోకి నిక్షిప్తం అయ్యేలా జాగ్రత్తలు తీసుకోవడం వల్ల ఇన్నాళ్లు అక్రమాలు వెలుగులోకి రాలేదని అధికారులు తెలిపారు. భూములను కుటుంబ సభ్యుల పేర్ల మీద మార్చుకోవడానికి ఎస్టేట్ గ్రామాలనే లక్ష్యంగా చేసుకున్నట్లు గుర్తించారు. రెవెన్యూ గ్రామాల పరిధిలోని భూముల వివరాలు దస్త్రాల్లో ఉండడంతో ఎస్టేట్ గ్రామాలను ఎంచుకొని అక్రమాలు కొనసాగించారు. సీసీఎల్‌ఏ వెబ్‌సైట్ ద్వారా సేకరించిన వివరాలతో అటవీ సమీప భూములు, గుట్టలను కుటుంబ సభ్యుల పేరుతో ఆన్‌లైన్‌లోకి గణేశ్ పిళ్లై ఎక్కించుకున్నారు.
దస్త్రాల నిర్వహణ సరిగా లేకపోవడం.. ఏళ్ల తరబడి జమాబందీ నిర్వహించకపోవడం వంటి లోపాలతో పిళ్లై అక్రమాలకు పాల్పడ్డారన్న అభిప్రాయం నిపుణుల్లో వ్యక్తమవుతోంది. గతంలోలాగా జమాబందీ, రికార్డుల్లో ఉన్న భూ విస్తీర్ణం మేరకు శిస్తు వసూలు వంటివి క్రమం తప్పకుండా జరిగితే ఇలాంటి అక్రమాలకు తావుండదంటున్నారు.
ఇదీ చదవండి:
CHITTOOR LAND SCAM: 2వేల 320 ఎకరాల భూములను కాజేసిన విశ్రాంత వీఆర్వో