కర్నూలు జిల్లా వెల్దుర్తి సమీపంలో...ఆదివారం ఘోర రోడ్డు ప్రమాదంలో చనిపోయిన 14 మంది మృతదేహాలకు..చిత్తూరు జిల్లాలో అంత్యక్రియలు నిర్వహించారు. గుర్రంకొండ మండలం తరిగొండలో 8 మృతదేహాలు, బి.కొత్తకోట మండలం సర్కారు తోపు - తుమ్మనగుంట పరిధిలో 4, మదనపల్లెలో 2 మృతదేహాలను ఖననం చేశారు. టెంపో డ్రైవర్ నజీర్, అమీర్ జాన్ అనే మహిళ మృతదేహాలకు మదనపల్లిలో అంత్యక్రియలు నిర్వహించగా...నజీరా బి సహా ఆమె కుటుంబసభ్యులు ఏడుగురిని తరిగొండలో ఖననం చేశారు. దస్తగిరి కుటుంబసభ్యులు నలుగురికి బి.కొత్తకోట మండలం సర్కారుతోపు-తుమ్మనగుంట పరిధిలో...ఇస్లాం సంప్రదాయ రీతిలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి మృతదేహాలను ఖననం చేశారు.
మూడు చోట్ల అంత్యక్రియలకు..ప్రభుత్వం తరఫున ఉప ముఖ్యమంత్రి నారాయణ స్వామి, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి హాజరయ్యారు. బాధిత కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం తరఫున రూ. 2 లక్షల చొప్పున చెక్కులను మంత్రులు అందజేశారు. అనంతరం అంత్యక్రియలు, ఊరేగింపులో పాల్గొని నివాళులర్పించారు. ప్రమాదంలో మృతి చెందిన దస్తగిరి కుమార్తెలు సమీరా, అమీరున్ చదువుకుంటున్న మదనపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో..విద్యార్థులు మౌనం పాటించి శ్రద్ధాంజలి ఘటించారు.
ఒకే కుటుంబానికి చెందిన 12 మంది ఘోర ప్రమాదంలో మృతి చెందటం..కళ్ళముందు తిరిగే వారంతా ఒక్కసారే కనుమరుగవడంతో...అంత్యక్రియలు నిర్వహించిన గ్రామాల్లో విషాద ఛాయలు నెలకొన్నాయి.
ఇదీచదవండి