కరోనా కారణంగా మార్చి 20 నుంచి తిరుమల శ్రీవారి దర్శనాలు నిలిపివేయడంతో పాటు.. తిరుమలలో లాక్‌డౌన్ పటిష్టంగా అమలు చేశారు. ఉన్న ఫళంగా దుకాణాలు మూసివేయడంతో అప్పటికే నిల్వ చేసుకొన్న వస్తువులను విక్రయించు కోలేకపోయారు. కొన్ని వస్తువులు కొన్ని కాలం చెల్లిపోగా.. మరికొన్ని పాడై వ్యాపారులు నష్టపోయారు. తిరుమలలో 1200 వరకు దుకాణాల్లో వివిధ రకాల వస్తువులు విక్రయిస్తుంటారు. 200 వరకు ఫ్యాన్సీ, శీతల పానీయాల దుకాణాలు, 150 దుకాణాల్లో టీ, అల్పాహారం కొట్లు ఉన్నాయి. మిగిలిన వాటిలో పూజా సామగ్రి, బొమ్మలు, దేవుళ్ల చిత్రపటాలు అమ్మి ఉపాధి పొందుతుంటారు. దర్శనాలు ప్రారంభించడంతో రద్దీ పెరిగి వ్యాపారాలు పుంజుకొంటాయని భావించిన వ్యాపారులకు నిరాశే ఎదురువుతోంది.
కరోనాకు ముందు తిరుమల శ్రీవారిని దర్శించుకోవడానికి సగటున లక్ష మంది వచ్చేవారు. ప్రస్తుతం తితిదే రోజుకు పదహారు వేల మందికి దర్శనాలకు మాత్రమే అవకాశం ఇచ్చింది. పరిమిత సంఖ్యలో తిరుమల వచ్చే భక్తులు.. స్వామివారిని దర్శించుకుని వెంటనే వెనుతిరుగుతున్నారు. కొనుగోళ్లపై ఆసక్తి చూపడం లేదు. వ్యాపారాలు ప్రారంభించడానికి కొత్త వస్తువులు కొనుగోలుకు అప్పులు చేసిన వ్యాపారులు.. అమ్మకాలు లేక ఉసూరంటున్నారు. తితిదే పూర్తి స్థాయిలో భక్తులను దర్శనాలకు అనుమతిస్తే తప్ప తమ వ్యాపారాలు పుంజుకొనే అవకాశం లేదంటున్నారు వ్యాపారులు.
ఇదీ చదవండి: