ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీకాళహస్తిలో కరోనా మహమ్మారి రోజురోజుకూ తీవ్రమవుతోంది. చిత్తూరు జిల్లాలోని మూడోవంతు కేసులు కేవలం ఈ ఒక్క పట్టణంలోనే నమోదవుతున్నాయి. లక్ష జనాభా మాత్రమే ఉన్న శ్రీకాళహస్తిలో 47 మందికి వైరస్ వ్యాప్తి చెందడం అధికారులకు అంతుబట్టడం లేదు. 24 గంటల వ్యవధిలోనే 14 పాజిటివ్ కేసులు బయటపడంతో అధికారులు మరింత అప్రమత్తయ్యారు. పట్టణం మొత్తం రెడ్‌జోన్‌గా ప్రకటించి లాక్‌డౌన్ నిబంధనలు కఠినతరం చేశారు. శ్రీకాళహస్తిలో ఎలాంటి లాక్‌డౌన్ మినహాయింపులు లేవన్న అధికారులు...ప్రజలెవ్వరూ బయటకు రావొద్దని ఆదేశించారు. నిత్యావసరాలను ఇంటింటికి సరఫరా చేస్తామని తెలిపారు. పరసర ప్రాంతాల్లోని మరో 7 మండలాలను సైతం రెడ్‌జోన్‌లోకి తీసుకొచ్చామని కలెక్టర్ వివరించారు. నిబంధనలు కఠినతరం చేయకపోతే పరిస్థితి చేయిదాటిపోయే ప్రమాదముందని ఆయన అన్నారు.
జిల్లా వ్యాప్తంగా
జిల్లావ్యాప్తంగా 5,740 మంది అనుమానితుల నుంచి నమూనాలు సేకరించగా....73మందికి పాజిటివ్ వచ్చింది. ఆరోగ్యం మెరుగుపడి మరో 11 మంది ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయ్యారు. మరో 1846 మందికి సంబంధించిన నమూనాల ఫలితాలు రావాల్సి ఉందని అధికారులు తెలిపారు. కరోనా అనుమానిత లక్షణాలు ఉన్న వారిలో ర్యాండమ్‌గా, రెడ్జోన్ల పరిధిలో పాజిటివ్ కేసులు వచ్చిన వారి ప్రైమరీ, సెకండరీ కాంటాక్ట్‌ల నుంచి నమూనాలు సేకరిస్తున్నారు.
పట్టణ పహారా
శ్రీకాళహస్తిలో హై అలర్ట్ ప్రకటించిన అధికారులు ప్రత్యేక సాయుధ బలగాలతో పట్టణమంతా పహారా కాస్తున్నారు. పోలీసు వాహనాలతో పట్టణంలో ట్రయిల్ రన్ చేపట్టారు. ఇంటి నుంచి బయటకు వస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
ఇదీ చదవండి : కరోనాను ఎదుర్కొనేందుకు 'ఆయుష్' మందు!