![](https://assets.eenadu.net/article_img/ap-main11a_184.jpg)
తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవా(tirumala brahmotsavam 2021)ల్లో భాగంగా అయిదో రోజైన సోమవారం రాత్రి ఆలయంలోని కల్యాణోత్సవ మండపంలో శ్రీ మలయప్పస్వామి వారు తనకెంతో ప్రీతిపాత్రమైన గరుడ వాహనంపై దర్శనమిచ్చారు. ఉదయం మోహినీ రూపంలో భక్తులకు అభయ ప్రదానం చేశారు. ముఖ్యమంత్రి జగన్‌మోహన్ రెడ్డి గరుడ వాహనసేవలో పాల్గొన్నారు. అంతకుముందు తిరుమల(ttd brahmotsavam 2021)లో పలు అభివృద్ధి కార్యక్రమాలను ఆయన ప్రారంభించారు. సోమవారం సాయంత్రం 6 గంటల సమయంలో తిరుమలలో బేడీ ఆంజనేయస్వామి ఆలయానికి చేరుకున్న ముఖ్యమంత్రికి తితిదే ఛైర్మన్ సుబ్బారెడ్డి, అధికారులు స్వాగతం పలికారు. ఆలయ ప్రధానార్చకులు వేణుగోపాల దీక్షితులు సీఎం తలకు పరివట్టం కట్టారు. ఆంజనేయస్వామిని దర్శించుకున్న అనంతరం ముఖ్యమంత్రి జగన్ తలపై పట్టువస్త్రాలతో స్వామి వారి ఆలయానికి చేరుకున్నారు. పట్టువస్త్రాలు సమర్పించి స్వామిని దర్శించుకున్నారు. రంగనాయకుల మండపంలో ముఖ్యమంత్రికి వేదపండితులు ఆశీర్వచనం చేసి, తీర్థప్రసాదాలు అందజేశారు. డ్రై ఫ్లవర్ టెక్నాలజీతో తయారు చేసిన శ్రీవారి చిత్రపటాన్ని తితిదే ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, ఈవో జవహర్‌రెడ్డి అందించారు. అనంతరం జగన్ ఆలయంలోని కల్యాణోత్సవ మండపంలో గరుడ వాహనంపై ఉన్న మలయప్పస్వామిని దర్శించుకున్నారు. అక్కడి నుంచి పద్మావతి అతిథిగృహానికి చేరుకుని రాత్రి బస చేశారు. మంగళవారం ఉదయం ముఖ్యమంత్రి మరోమారు శ్రీవారిని దర్శించుకుంటారు. పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటారు.
![](https://assets.eenadu.net/article_img/ap-main11b_43.jpg)
తితిదే డైరీలు, క్యాలెండర్ల ఆవిష్కరణ
తితిదే 2022 సంవత్సరం డైరీలు, క్యాలెండర్ల(ttd calendar-2022)ను ముఖ్యమంత్రి ఆవిష్కరించారు. ఇవి తిరుమల, తిరుపతిలోని తితిదే పుస్తక విక్రయశాలల్లో అందుబాటులో ఉన్నాయి. వారం రోజుల్లో తితిదే సమాచార కేంద్రాల్లో అందుబాటులో ఉంచుతారు.
![](https://assets.eenadu.net/article_img/ap-main11c_13.jpg)
చిన్నపిల్లల గుండె చికిత్సల ఆసుపత్రి ప్రారంభం
ముఖ్యమంత్రి జగన్ సోమవారం ఉదయం తిరుపతిలో పలు ప్రారంభోత్సవ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. బర్డ్ ఆస్పత్రి ప్రాంగణంలో ఏర్పాటు చేసిన శ్రీ పద్మావతి చిన్నపిల్లల గుండె చికిత్సల ఆస్పత్రిని ప్రారంభించారు. ఆస్పత్రి ప్రత్యేకతలపై రూపొందించిన మూడు నిమిషాల వీడియోను వీక్షించారు. అనంతరం అలిపిరి పాదాల మండపం వద్దకు చేరుకుని సప్తగోప్రదక్షిణ మందిర సముదాయాన్ని ప్రారంభించారు. దీన్ని రూ.15 కోట్లు వెచ్చించి చెన్నైకి చెందిన తితిదే ధర్మకర్తల మండలి మాజీ సభ్యులు ఏజే శేఖర్ నిర్మించారు. సప్తగిరులకు సూచికగా ఏడు జాతుల గోవులను మందిరంలో ఉంచారు. గో మందిరంలో ప్రదక్షిణ చేసుకున్న సీఎం.. భక్తులు మొక్కులు తీర్చుకోవడానికి ఏర్పాటు చేసిన గో తులాభార మండపాన్ని వీక్షించారు. రిలయన్స్ సంస్థ విరాళంతో పునర్నిర్మించిన అలిపిరి నడకదారి పైకప్పును ఆయన ప్రారంభించారు. కార్యక్రమాల్లో ఉపముఖ్యమంత్రి నారాయణస్వామి, శాసనసభ ఉప సభాపతి కోన రఘుపతి, మంత్రులు వెలంపల్లి శ్రీనివాసరావు, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, మేకపాటి గౌతమ్‌రెడ్డి, కన్నబాబు, కొడాలి నాని, అనిల్‌కుమార్ యాదవ్, ఎంపీలు గురుమూర్తి, మిథున్‌రెడ్డి, వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, భరత్, ఎమ్మెల్యేలు కరుణాకర్‌రెడ్డి, వెంకటేేగౌడ, ఆదిమూలం, జడ్పీ ఛైర్మన్ శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.
![](https://assets.eenadu.net/article_img/ap-main11d_6.jpg)
ఇదీ చదవండి
Lokesh letter to CM Jagan: వైకాపా పాలనలో విద్యుత్ కోతలు, బిల్లుల వాతలు: లోకేశ్