ఏటీఎం కేంద్రాల్లో నగదు తీసుకునేందుకు వచ్చినవారికి సాయం చేస్తానంటూ నమ్మించి.. తెలుగు రాష్ట్రాల్లో నగదు కాజేస్తున్న 16 ఏళ్ల బాలుడ్ని చిత్తూరు పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. చిత్తూరులోని వన్‌టౌన్ స్టేషన్‌లో చిత్తూరు డీఎస్పీ సుధాకరరెడ్డి చెప్పిన వివరాలు ప్రకారం.. తాళంబేడుకు చెందిన బేబిషాలిని ఈ నెల 24న డ్వాక్రా నగదు కోసం చిత్తూరులోని ఓ ఏటీఎంకు వెళ్లగా.. ఆమె కార్డు తీసుకుని దృష్టి మరల్చి మోసం చేసిన సదరు బాలుడు.. రూ.70వేలు కాజేశాడు.
ఆమె చరవాణికి వచ్చిన సందేశం ఆధారంగా పోలీసులకు ఫిర్యాదు చేయడంతో సీఐ నరసింహరాజు, ఎస్సైలు అనిల్‌కుమార్, పద్మావతి ఆధ్వర్యంలో ప్రత్యేక బృందం శ్రీకాకుళం జిల్లా సరిబుజ్జుకు చెందిన వాడిగా గుర్తించారు. 16కు పైగానే ఏటీఎం చోరీల్లో రూ.10.52 లక్షల నగదు కాజేశాడు. ఈ నెల ఏడో తేదీన విశాఖ పోలీసులు అరెస్టు చేసి అబ్జర్వేషన్ హోమ్‌లో ఉంచగా.. అక్కడినుంచి పారిపోయి విజయవాడ, చిత్తూరులో నేరాలకు పాల్పడ్డాడు. తమ బృందం అరెస్టుచేసి రూ.3లక్షల విలువైన కేటీఎండ్యూక్ బైక్, రూ.65వేల నగదు స్వాధీనం చేసుకున్నారు’ అని డీఎస్పీ చెప్పారు.
ఇదీ చదవండి: Lady police : గంజాయి తోటల్ని ధ్వంసం చేసిన మహిళా పోలీస్..అధికారుల అభినందనలు