‘వైకాపా బెదిరింపులు, దౌర్జన్యాలకు భయపడే వ్యక్తిని కాదు.. క్లేమోర్ మైన్స్‌కే భయపడలేదు.. గులకరాళ్లకు భయపడతానా? నేనూ ఇదే తరహాలో ఆలోచిస్తే ఒక్క వైకాపా నేత బయట తిరిగేవాడా? రౌడీయిజాన్ని సాగనివ్వను...’ అని తెదేపా అధినేత చంద్రబాబు హెచ్చరించారు. ‘నలభై ఏళ్లలో ఎప్పుడూ నా సభపై రాయివేసే సాహసం చేయలేదు. పోలీసులు లేకుండా రండి మీ శక్తి, నా శక్తి తేల్చుకుందాం...’ అని సవాల్ చేశారు. రాళ్లదాడి ఘటనపై కేంద్ర ఎన్నికల కమిషన్, రిటర్నింగ్ అధికారి, కేంద్ర హోంశాఖ కార్యదర్శి, గవర్నర్‌ను కలిసి ఫిర్యాదు చేశామన్నారు. మంగళవారం తిరుపతి పార్టీ కార్యాలయంలో నిర్వహించిన ఉగాది ఉత్సవాల్లో ఆయన పాల్గొన్నారు. అనంతరం చంద్రబాబు కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడారు. ‘తెదేపాకు కార్యకర్తలు బలం... సైనికులుగా పనిచేస్తూ ప్రభుత్వ అరాచకాలపై పోరాడుతున్నారు. అక్కడక్కడ కొందరు లాలూచీ పడుతూ, వారికి సరెండర్ అవుతున్నారు. ఇక్కడి సమాచారం అక్కడకు చేర¢వేస్తున్నారు. రాష్ట్రాన్ని రక్షించుకునేందుకు నేను పోరాటం చేస్తున్నా. ఇలా లాలూచీ పడితే వారికి ఒక నమస్కారం పెట్టి వదులుకుంటా...’ అని పేర్కొన్నారు.
సంకల్పం చేద్దాం
‘తెలుగువారి సంవత్సరాది ఉగాది రోజున ఏ సంకల్పం చేసినా మంచి ఫలితాలు వస్తాయి. 17వ తేదీన ఎన్నికల్లో తెదేపా అభ్యర్థిని గెలిపిద్దామని శ్రీవారి సాక్షిగా సంకల్పం చేద్దాం. తిరుపతి తెదేపాకు కంచుకోట. శక్తి మేరకు పోరాడుదాం. పార్టీ బతికితేనే అందరికీ గౌరవం ఉంటుంది. ఉప ఎన్నిక సమయంలో ఐదు సభలు నిర్వహించా. ప్రజల నుంచి మంచి స్పందన వస్తోంది. ప్రజలంతా మీతోనే ఉంటామని... అయితే మంచి నాయకత్వాన్ని ఇవ్వమని కోరుతున్నారు. ఆ విశ్వాసాన్ని ప్రజలకు అందించాల్సిన బాధ్యత అందరిపైనా ఉంది. 60 లక్షల కార్యకర్తలు ఉన్న ఏకైక పార్టీ తెదేపానే. స్థానిక నాయకులు జవాబుదారీతనంతో పనిచేయాలి. ఇప్పుడు సమర్థŸమైన నాయకత్వం కావాలి. అవసరమైతే పార్టీని ప్రక్షాళన చేస్తా...’ అని చంద్రబాబు స్పష్టం చేశారు. ‘ఉప ఎన్నికలో ఐదు లక్షల ఆధిక్యత వస్తుందని వైకాపా నేతలు చెబుతున్నారు. కనీసం ఐదు ఓట్లు కూడా ఎందుకు వేయాలో సమాధానం చెప్పాలి. ప్రజలందరికీ నమ్మక ద్రోహం చేశారు. ఈవీఎంలో ఏ గుర్తుకు ఓటు వేశారనేది వాలంటీర్లకు ఎలా తెలుస్తుంది. ఈ విషయాన్ని కార్యకర్తలు ప్రజలకు వివరించి వారికి ధైర్యం కల్పించాలి...’ అని చంద్రబాబు పేర్కొన్నారు.
తెదేపా కార్యాలయంలో ఉగాది ఉత్సవాలు
తెదేపా కార్యాలయంలో ఉదయం జరిగిన ఉగాది ఉత్సవాల్లో చంద్రబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా గౌతమ్‌శర్మ పంచాంగాన్ని వినిపించారు. సోమవారం తెదేపా సభలో జరిగిన సంఘటన బాధాకరమని ఇటువంటివి మరిన్ని ఎదురవుతాయన్నారు. మనో నిబ్బరంతో ఎదుర్కోవాలని సూచించారు. అనంతరం చంద్రబాబు మాట్లాడుతూ... ‘ఈ ఏడాది తెదేపాదే. జీవితంలో ఏదీ శాశ్వతం కాదు. తిరుపతి ఉపఎన్నికల ఫలితాలతో ఇది నిరూపితమవుతుంది...’ అని పేర్కొన్నారు. ప్రపంచ దేశాల్లోని ప్రతి ఒక్కరికీ ఆయన ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా వేదపండితులు చంద్రబాబుకు ఆశీర్వచనం తెలిపి ఉగాది పచ్చడిని అందించారు. తిరుపతి మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ చంద్రబాబుకు శాలువాకప్పి సత్కరించారు.
సాక్ష్యాలు నేను తీసుకురావాలంట?
గూడూరు సభలో చంద్రబాబు‘తిరుపతి సభలో రాళ్లు విసిరిన సంగతి తెలిసిందే. దీనిపై నేనే స్వయంగా ఎస్పీ కార్యాలయానికి వెళ్లా. అక్కడున్న అదనపు ఎస్పీకి ఫిర్యాదు చేశా. కేసు నమోదు చేసి, విచారణ చేస్తామని చెప్పిన పోలీసులు.. ఆధారాలు దొరకలేదని చెబుతున్నారు. డీజీపీ పూలు పడ్డాయి. అసలు రాళ్లు పడలేదని చెప్పడం విడ్డూరంగా ఉంది’ అని చంద్రబాబు పేర్కొన్నారు. మంగళవారం ఆయన నెల్లూరు జిల్లా గూడూరులో రోడ్‌షో, సభలో పార్టీ అభ్యర్థి పనబాక లక్ష్మితో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ‘వాహనంపై రాళ్లున్నాయి.. దెబ్బతగిలిన మనిషి ఉన్నారు. ఆమెకు తగిలిన గాయాలకు రక్తం కారింది.. ఇవన్నీ ఉన్నా ఆధారాలు లేవని చేతులెత్తేశారు. రాళ్లేసిన నిందితులను పక్కకు తప్పించి.. పోలీసులు ఫోజులు కొడుతున్నారు. పైగా సాక్ష్యాలు తెచ్చివ్వాలంటూ నాకే నోటీసులిస్తున్నారు. అంటే.. నేను ఎన్నికల ప్రచారం ఆపేసి.. సాక్ష్యాలు వెతుక్కుంటూ తిరగాలా? అన్నీ నేను తెచ్చిస్తే.. పోలీసులు ఏం చేస్తారు...’ అని ప్రశ్నించారు. ‘ఇప్పటివరకూ కోడి కత్తి కేసు, వివేకా హత్య కేసుల్లో పోలీసుల పనితనం ఏమిటో చూశామ’ని చంద్రబాబు వ్యాఖ్యానించారు. ‘వైకాపా వాలంటీర్లతో బెదిరింపులకు పాల్పడుతోంది. మాకు ఓటేయకపోతే అమ్మఒడిని ఆపేస్తాం.. పింఛను పీకేస్తాం.. అంటూ ఇంటింటికి తిరిగి భయపెడుతున్నారు. ప్రజలు మిమ్మల్ని పీకేసే రోజు త్వరలోనే వస్తుంది...’ అని ధ్వజమెత్తారు. ‘తిరుపతి సభలో నేను అడిగిన ప్రశ్నలకు జగన్‌రెడ్డి ప్రజలకు సమాధానం చెబుతారని భావించాను. కొవిడ్ నేపథ్యంలో ఆ పర్యటన రద్దు చేసుకున్నట్లు ప్రకటించారు. రూ.కోట్లు ఖర్చుపెట్టి.. వాలంటీర్ల సన్మాన కార్యక్రమం నిర్వహించినప్పుడు కరోనా గుర్తుకు రాలేదా’ అని చంద్రబాబు ప్రశ్నించారు.