చిత్తూరు జిల్లా కలికిరి మండలం ఈతమానువడ్డిపల్లిలో పెళ్లింట విషాదం చోటు చేసుకుంది. రోడ్డు ప్రమాదంలో పెళ్లికొడుకు తండ్రి మృతితో ఆ ఇంట జరగాల్సిన వివాహం నిలిచిపోయింది. కలికిరి మండలం ఈతమను వడ్డిపల్లికు చెందిన చిన్నప్ప కుమార్తెకు, అనంతపురం జిల్లా కంబదూరు మండలం వైసీపీ పల్లె గ్రామానికి చెందిన ఓబులేసు కుమారుడుకి పెళ్ళి నిశ్చయించారు. పెళ్లి కుమార్తె ఇంటి వద్ద జరగనున్న వివాహ మహోత్సవానికి పెళ్లి కుమారుడితో పాటు బంధువులు, కుటుంబ సభ్యులందరూ ప్రత్యేక బస్సులో తరలివచ్చారు. బస్సు దిగిన పెండ్లి కుమారుడు తండ్రి ఓబులేసు చిత్తూరు-కడప జాతీయ రహదారి పక్కన ఉండగా అతి వేగంగా దూసుకొచ్చిన ఓ కారు ఆయన్ను ఢీకొంది. ఈ ప్రమాదంలో ఆయన మృతి చెందారు. ఈ సంఘటనతో ఇరువురి కుటుంబాల్లో విషాదఛాయలు అలుముకున్నాయి. బంధువులు, అతిథులతో కళకళలాడాల్సిన ఆ ఇంట విషాదం మిగిలింది. మరికొన్ని గంటల్లో జరగాల్సిన పెళ్లి ఆగిపోయింది.
ఇదీ చూడండి పదోతరగతి విద్యార్థి ఆత్మహత్య