చిత్తూరు జిల్లా రేణిగుంట పరిధి తారకరామనగర్‌లోని రేణిగుంట - కడప మార్గంలో రైలు పట్టాలపై బాంబు పేలుడు కలకలం సృష్టించింది. ఈ ఘటనలో ఓ మహిళ తీవ్రంగా గాయపడింది. జీఆర్పీ పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. రేణిగుంట రైల్వే స్టేషన్ పరిధిలోని రైల్వే ట్రాక్ పరిసరాల్లో పశువులు కాస్తున్న శశికళ అనే మహిళ ఓ డబ్బాను గుర్తించింది. వెంటనే తన చేతిలో ఉన్న కర్రతో డబ్బాను కదిలించడంతో భారీ శబ్ధంతో పేలుడు సంభవించింది. పేలుడు ధాటికి మహిళ తీవ్రంగా గాయపడింది. క్షతగాత్రురాలిని 108 వాహనంలో చికిత్స నిమిత్తం తిరుపతి రుయా ఆస్పత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న జీఆర్పీ, రేణిగుంట పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు. అయితే ఇక్కడ అడవి పందుల కోసం గతంలో నాటు బాంబులు పెట్టేవారని స్థానికులు చెబుతున్నారని.. ఇదే కాకుండా ఇతరత్రా అన్ని కోణాల్లో విచారణ జరుపుతున్నట్లు రేణిగుంట సీఐ అంజు యాదవ్ తెలిపారు.
అది ఎంఈకేపీ ముడి పదార్థం డబ్బా: ఎస్పీ
ఈ పేలుడుకు గల కారణాన్ని ప్రాథమికంగా నిర్ధారించినట్లు తిరుపతి అర్బన్ ఎస్పీ రమేశ్‌రెడ్డి తెలిపారు. బాలాజీ వెల్డింగ్ వర్క్స్‌లో హీట్ రెసిస్టింగ్ పనులు చేస్తుంటారని.. అందులో మిథైల్ ఈథైల్ కీటో పెరాక్సైడ్ (ఎంఈకేపీ) అనే ముడి పదార్థాన్ని వాడతారని చెప్పారు. దాన్ని నిల్వ చేసే డబ్బా ఖాళీ అవడంతో బయట పడేశారన్నారు. రైల్వే ట్రాక్ పక్కన పేలిన పదార్థం అదేనని ప్రాథమిక విచారణలో తేలినట్లు ఎస్పీ తెలిపారు.
ఇదీ చదవండి: 35 ఏళ్లపైబడిన వాలంటీర్లు ఔట్.... జిల్లా యంత్రాంగానికి సీఎం ఆదేశం...