చిత్తూరు జిల్లా బైరెడ్డిపల్లె - పుంగనూరు రహదారి విస్తరణకు నోచుకోకపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తోంది. ఈ మార్గం వాహనాల రాకపోకలతో నిత్యం రద్దీగా ఉంటోంది. కడప, అనంతపురం నుంచి వచ్చే సిమెంటు, నాపరాళ్ల లారీలు, ఇతర వాహనాలు ఈ రోడ్డుపై రాకపోకలు సాగించడంతో రహదారి త్వరగా పాడవుతోంది. అసలే ఇరుకు మార్గం..ఆపై రోడ్డు పొడవునా గుంతలు ఏర్పడటంతో వాహన చోదకులు తరచూ ప్రమాదాలకు గురవుతున్నారు.
తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలకు బైరెడ్డిపల్లె సరిహద్దు ప్రాంతం కావడంతో బైరెడ్డిపల్లె-పుంగనూరు రోడ్డుపై రద్దీ ఏర్పడుతోంది. చెన్నై-బెంగళూరు జాతీయ రహదారి నుంచి కుప్పం, తమిళనాడు వైపు వెళ్లే వాహనాలు ఇదే మార్గంలో ప్రయాణం సాగిస్తుండటంతో భారీ వాహనాలు ఎదురైతే రాకపోకలకు అంతరాయం ఏర్పడుతోంది. రెండేళ్ల క్రితం అప్పటి ప్రభుత్వం రహదారి విస్తరణకు నిధులు మంజూరు చేయడంతో నాటి మంత్రి అమరనాథరెడ్డి బైరెడ్డిపల్లెలో శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. రోడ్డు అభివృద్ధికి శిలాఫలకం ఏర్పాటు చేసి రెండేళ్లు గడుస్తున్నా పనులు మాత్రం ప్రారంభం కాలేదు. స్థానిక సంస్థల ఎన్నికల సభలో ప్రస్తుత పంచాయతీరాజ్‌శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పుంగనూరు రోడ్డు విస్తరణ పనులు త్వరలోనే ప్రారంభిస్తామని హామీ ఇచ్చారు.
దగ్గరి మార్గంలో ప్రయాణం కష్టమే
అటు చెన్నై-బెంగళూరు.. ఇటు మదనపల్లె-కృష్ణగిరి జాతీయ రహదారులను కలుపుతున్న బైరెడ్డిపల్లె-పుంగనూరు రోడ్డు ప్రయాణికులకు దూరాన్ని తగ్గిస్తోంది. బైరెడ్డిపల్లె నుంచి పలమనేరు మీదుగా పుంగనూరు వెళ్లాలంటే 52 కి.మీ ప్రయాణం చేయాలి. బైరెడ్డిపల్లె నుంచి నాలుగురోడ్లు మీదుగా 33 కి.మీ దూరం వెళ్లే పుంగనూరు చేరుకోవచ్చు. జాతీయ రహదారి మీదుగా వెళ్లాల్సిన భారీ వాహనాలు సైతం 20 కి.మీ దూరం తగ్గుతోందని ఇరుకు మార్గంలో రాకపోకలు సాగిస్తూ ప్రయాణికులకు ఇబ్బందులు కల్గిస్తున్నారు. 15-20 టన్నులకు పైగా వెళ్లే లారీలు కూడా ఈ రోడ్డుపై వెళ్తుండటంతో రహదారి త్వరగా పాడై గుంతలమయంగా మారుతోంది. ఆర్‌అండ్‌బీ అధికారులు తాత్కాలిక మరమ్మతు పనులు చేసినా కొద్ది రోజుల్లోనే గుంతలు ఏర్పడుతున్నాయి. వర్షాకాలంలో రోడ్డు పక్కన కోతలకు గురైతే ఎదురెదురుగా రెండు భారీ వాహనాలు వస్తే ఎటూ వెళ్లలేని పరిస్థితి ఏర్పడుతోంది.
విస్తరణతో ప్రమాదాలకు అడ్డుకట్ట
నిత్యం రద్దీగా ఉండే ఈ మార్గంలో వాహన చోదకులు తరచూ ప్రమాదాలకు గురవుతున్నారు. ఆర్టీసీ బస్సు సదుపాయం లేకపోవడంతో ప్రయాణికులకు ఆటోలే శరణ్యం. గుంతలను తప్పించే ప్రయత్నంలో వాహన చోదకులు అటూ.. ఇటూ ప్రయాణిస్తూ ఎదురుగా వచ్చే చోదకులను తికమక చేసి ప్రమాదాల్లోకి నెట్టేస్తున్నారు. అధికారులు స్పందించి రహదారి విస్తరణ పనులు త్వరగా పూర్తి చేయాలని స్థానికులు కోరుతున్నారు.
రూ.28 కోట్లు మంజూరు
బైరెడ్డిపల్లె-పుంగనూరు రహదారి అభివృద్ధికి ప్రభుత్వం రూ.28 కోట్లు నిధులు మంజూరు చేసింది. రహదారి విస్తరణ పనులు టెండర్ల దశలో ఉన్నాయి. టెండర్ల ప్రక్రియ పూర్తి కాగానే రోడ్డు విస్తరణ పనులు చేపడతాం. - రామాంజనేయులు, ఆర్‌అండ్‌బీ డీఈ, పలమనేరు
ఇదీ చదవండి: