తిరుమల తిరుపతి దేవస్థానం ఉద్యోగులు, పెన్షనర్లు, వారి కుటుంబసభ్యులకు బర్డ్‌లో నగదు రహిత వైద్య సేవలు అందించనున్నారు. తిరుపతి పద్మావతి విశ్రాంతి గృహంలో తితిదే ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి అధ్యక్షతన జరిగిన బర్డ్ ట్రస్ట్ సమావేశంలో పలు నిర్ణయాలు తీసుకున్నారు.
సిమ్స్ తరహాలో తితిదే ఉద్యోగులు, పెన్షనర్లు వారి కుటుంబసభ్యులకు ఉచిత వైద్య సేవలు, సర్జరీలు చేసి తితిదే నుంచి బిల్లు వసూలు చేసుకోవడానికి కమిటీ ఆమోదం తెలిపింది. బర్డ్ ఆసుపత్రిలో రోగులకు ఫిజియోథెరపి చేయడానికి.. రోబో అసిస్టెడ్ గెయిట్ ట్రైనింగ్ థెరఫీ యంత్రం, రక్త ప్రసరణ వ్యవస్థ ఎలా ఉందో గుర్తించడానికి ఉపయోగపడే 2డీ కలర్ డాప్లర్ యంత్రం కొనుగోలు చేయడానికి కమిటీ ఆమోదం తెలిపింది.
ఆర్థోపెడిక్ వైద్యంలో నిష్ణాతులైన తిరుపతికి చెందిన విద్యాసాగర్, నెల్లూరుకు చెందిన ప్రొఫెసర్ కృష్ణారెడ్డి, డాక్టర్ గురువారెడ్డి సేవలను ఉచితంగా ఉపయోగించుకోవడానికి కమిటీ ఆమోదించింది. బోర్డు సభ్యులు డాక్టర్ నిశ్చిత, శివశంకరన్, బర్డ్ డైరెక్టర్ డాక్టర్ మదన్ మోహన్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశంలో పాల్గొన్నారు. ఈవో అనిల్ కుమార్ సింఘాల్, జేఈవో బసంత్ కుమార్ పద్మావతి విశ్రాంతి గృహం నుంచి సమావేశంలో పాల్గొన్నారు.
ఇదీ చదవండి: అమెరికాలో పోలీసుల కాల్పులు.. ఏడుగురికి గాయాలు