Balancing Reservoir Works: చట్టాలంటే లెక్కుంటే.. ఇక్కడ ఈ లారీలు తిరిగేవి కాదు. ట్రైబ్యునళ్లంటే భయముంటే.. ఇక్కడీ పర్యావరణ విధ్వంసం జరిగేది కాదు. అధికారులు కొరడా ఝుళిపించి ఉంటే.. ఇక్కడీ ప్రొక్లెయిన్ల తవ్వకాలు జరిగేవి కాదు.. ఇక్కడ పర్యావరణ విధ్వంసంతోపాటు.. కోర్టు ఆదేశాల ధిక్కరణ కూడా జరిగింది. ఐనా అధికారులెవరూ ఆపలేదు. కనీసం అభ్యంతరమూ చెప్పలేదు. ఎందుకంటే.. ఈ పనులు మంత్రి పెద్దిరెడ్డి ఇలాకాలోనివి. అందుకే ఇంత బరితెగింపు.
ఆదేశాలు లెక్క చేయకుండా.. పర్యావరణ అనుమతులు పొందేందుకు తప్పుడు దస్త్రాలు సమర్పించారన్న నేపథ్యంలో ఉమ్మడి చిత్తూరు జిల్లాలో చేపట్టిన మూడు జలాశయాల నిర్మాణాలు వెంటనే నిలిపివేయాలన్న జాతీయ హరిత ట్రిబ్యునల్ ఆదేశాలను జలవనరుల శాఖ అధికారులు పట్టించుకోలేదు.. నిర్మాణాలను నిలిపివేయడంతో పాటు వంద కోట్ల రూపాయల జరిమానా చెల్లించాలని ఆదేశాలు జారీ చేసినా.. అధికారులు ఏమీ పట్టనట్లు నిర్మాణ పనులను కొనసాగిస్తున్నారు. 2 వేల 144 కోట్ల రూపాయలతో చేపట్టిన జలాశయాల నిర్మాణాలు కొనసాగుతున్నాయి. కొండలు తవ్వుతూ.. గుట్టలు చదును చేస్తూ నిర్మాణాలు యదేఛ్చగా సాగిస్తున్నారు. జాతీయ హరిత ట్రిబ్యునల్ ఆదేశాలు లెక్క చేయకుండా జలాశయాలు నిర్మాణాలు సాగుతుండటంపై.. నిర్వాసితులు, పర్యావరణవేత్తలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.
ఎన్జీటీ ఆదేశాలు.. వైసీపీ అధికారంలోకి వచ్చాక ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని.. పుంగనూరు, తంబళ్లపల్లె నియోజకవర్గాల్లో మూడు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ల నిర్మాణానికి.. రాష్ట్ర జలవనరుల శాఖ ఆమోదం తెలిపింది. పుంగనూరు నియోజకవర్గం ఆవులపల్లిలో 3.5 టీఎంసీల సామర్థ్యం, నేతిగుట్లపల్లెలో ఒక టీఎంసీ సామర్థ్యం.. తంబళ్లపల్లె నియోజకవర్గం ముదివేడులో రెండు టీఎంసీల సామర్థ్యంతో జలాశయాలకు.. 2020 సెప్టెంబరు 2న పాలనాపరమైన అనుమతులిచ్చింది. గాలేరు-నగరి.. హంద్రీనీవా సుజల స్రవంతి అనుసంధానం ద్వారా.. ఈ రిజర్వాయర్లలో నీళ్లు నింపాలన్నది ప్రతిపాదన. ఆ మూడు ప్రాజెక్టుల్లో అనేక ఉల్లంఘనలు జరిగాయని.. రాష్ట్ర పర్యావరణ ప్రభావ అంచనా అథారిటీ నిబంధనలకు విరుద్ధంగా పర్యావరణ అనుమతులిచ్చిందని కొందరు రైతులు చెన్నైలోని.. జాతీయ హరిత ట్రైబ్యునల్‌ను ఆదేశించారు. ఉల్లంఘనలు నిజమేనని గుర్తించిన ఎన్జీటీ.. ఆ మూడు ప్రాజెక్టుల పనుల్ని తక్షణమే నిలిపేయాలని ఈ నెల 11న ఆదేశించింది. రాష్ట్ర జలవనరుల శాఖకు వంద కోట్ల రూపాయల జరిమానా కూడా విధించింది.
యధావిధిగా పనులు.. కానీ ఎన్జీటీ ఆదేశాలు అమలు కాలేదు. ఏకంగా వంద కోట్లు జరిమానా విధించినా లెక్క చేయకుండా ప్రొక్లెయినర్లు, టిప్పర్లతో పనులు యధావిధిగా కొనసాగిస్తున్నారు. ఈటీవీ-ఈనాడు మంగళవారం పరిశీలనకు వెళ్లగా ఆ మూడు ప్రాజెక్టుల్లోనూ పనులు.. కొనసాగుతున్నాయి. ఆవులపల్లి ప్రాజెక్టు స్థలంలో పొక్లెయిన్లు, ఇతర యంత్రాలు దుమ్ము రేపుతున్నాయి. ప్రొక్లైన్లతో రిజయర్వాయర్ ప్రాంతాన్ని చదును చేస్తున్నారు. ఇసుక, మట్టి, కంకర, రెడీమిక్స్ కాంక్రీట్ లారీలు అదేపనిగా తిరుగుతున్నాయి. సుమారు 60 మంది.. అక్కడ పని చేస్తున్నారు. పనుల్లో భాగంగా చేస్తున్న పేలుళ్లతో భయపడిపోతున్నామని నిర్వాసిత గ్రామాల ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నేతిగుట్లపల్లె, ముదివేడు రిజర్వాయర్లలోనూ పనులు జరుగుతున్నాయి.. ఎన్జీటీ ఆదేశాలపై దిద్దుబాటు చర్యలు చేపట్టాల్సిన రాష్ట్ర ప్రభుత్వం.. సుప్రీం కోర్టుకు వెళ్లింది. ఎన్జీటీ ఉత్తర్వులు నిలుపదల చేయాలని కోరింది. దీనికి సర్వోన్నత న్యాయస్థానం నిరాకరించింది. ప్రభుత్వ పిటిషన్‌పై ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది. ఇప్పుడైనా అధికారులు జోక్యం చేసుకుని పనులు ఆపాలని పిటిషనర్లు కోరుతున్నారు.
ఇవీ చదవండి: