అరణియార్.. చిత్తూరు జిల్లాలోని మధ్యతరహా సాగునీటి ప్రాజెక్టుల్లో ప్రధానమైనది. ఈ ప్రాజెక్టుకు ఆరు దశాబ్దాల చరిత్ర ఉంది. తొలినాళ్లలో రైతులు మూడు పంటలు పండించగా.. నేడు నామమాత్రపు ప్రాజెక్టుగా మారి రైతులను సంకటస్థితికి చేర్చేలా మారింది. నిర్వహణలోపం కారణంగా ఒక పంటకు సైతం సక్రమంగా నీటిని అందించలేక మౌనంగా రోదిస్తోంది అరుణమ్మ.
ఒక కిలోమీటరు పైబడి ఉన్న ప్రాజెక్టు కట్ట ప్రస్తుతం దుస్థితికి చేరింది. స్పిల్‌వే గేట్ల నిర్వహణ నామమాత్రంగా మారింది. కుడి, ఎడమ కాలువల్లో పిచ్చిమొక్కలు పెరిగాయి. పలుచోట్ల కాలువలు ఆక్రమణలకు గురయ్యాయి. రెండు మండలాల్లోని నాలుగు వేల మంది రైతులకు సాగునీటి కష్టాలు తప్పడంలేదు. అనుబంధంగా ఉన్న మత్స్య పరిశ్రమ దయనీయంగా మారింది.
గాలేరి - నగరి నీరు, తెలుగుగంగ జలాలను అరణియార్‌కు మళ్లించే ప్రతిపాదనలు కార్యరూపం దాల్చటం లేదు.
ఊరించే జైకా.. ఊరటనిచ్చే దెప్పుడో..?
2015వ సంవత్సరంలో జైకా నిధులకు రూ.35.64 కోట్ల అంచనాతో పనులకు టెండర్లు పూర్తి చేశారు. అయిదు సంవత్సరాలు పూర్తయినా నేటికి పనులు ప్రారంభం కాలేదు. నల్లచెరువు కాలువ పునరుద్ధరణ పనులు అటకెక్కాయి.
సిబ్బంది కొరత: 28 మంది సిబ్బంది పని చేయాల్చి ఉంది. అయితే ఆరుగురు మాత్రమే విధులు నిర్వహిస్తున్నారు. ఫలితంగా నిర్వహణ అస్తవ్యస్తంగా మారింది.
గాలేరు-నగరితో మహర్దశ
అరణియార్‌కు ప్రధాన నీటి వనరుగా ఉన్న ప్రాంతాల్లో చెక్‌డ్యాంల ఏర్పాటుతో నీటి నిల్వ గణనీయంగా పడిపోయింది. దీంతో గాలేరు-నగరి నీటిని అరణియార్‌కు అందించాలని ముఖ్యమంత్రిని కోరాను. సానుకూలంగా స్పందించారు. రైతుల సాగునీటి సమస్యలను పరిష్కరిస్తాం. - కోనేటి ఆదిమూలం, ఎమ్మెల్యే
ఒప్పందం పూర్తి.. కరోనాతో జాప్యం
జైకా నిధుల్లో రూ.26.01 కోట్ల అంచనాతో పనులకు టెండర్లు, ఒప్పందాల ప్రక్రియ పూర్తయింది. కరోనా కారణంగా ప్రస్తుతం పనుల్లో జాప్యం నెలకొంది. లాక్‌డౌన్ పూర్తయిన అనంతరం పనులను ప్రారంభిస్తాం. గాలేరు-నగరి, తెలుగుగంగ జలాల మళ్లింపు ప్రక్రియకు ప్రతిపాదనలు పంపించాం. - లోకేశ్వర్‌రెడ్డి, ప్రాజెక్టు ఏఈ, పిచ్చాటూరు
ప్రాజెక్టు: అరణియార్
నిర్మాణం: 1958 సంవత్సరం
నిర్మాణ వ్యయం: రూ.1.26 కోట్లు
విస్తీర్ణం: 14 చ.కి.మి.లు.
నీటి వనరు: మూలకోన, గూళూరు చెరవులతో పాటు కొండ ప్రాంతాల నుంచి వచ్చే జలాలు
నీటి నిల్వ సామర్థ్యం: 1.85 టీఎంసీలు
ప్రస్తుత నీటి నిల్వ: 0.124 టీఎంసీలు
ప్రాజెక్టు పరిధిలోని మండలాలు: నాగలాపురం, పిచ్చాటూరు.
పరిధిలోని చెరువులు: వేలూరు, నీరువాయి, కుప్పంకండ్రిగ, కొత్తూరు, రామాపురం, వెంగళత్తూరు, రామగిరి, కృష్ణాపురం, ఎర్రచెరువు.
కుడి కాలువ పొడవు: 4.14 కి.మీ.
ఎడమ కాలువ పొడవు: 4.73 కి.మీ.
ఆయకట్టు: అధికారికంగా 5500 ఎకరాలు, అనధికారికంగా 12 వేల ఎకరాలు.
ఇదీ చదవండి: 'ఇద్దరు బాలికలను కిడ్నాప్ చేసిన వాలంటీర్లు'