మదనపల్లె ప్రజల దాహార్తి తీర్చేందుకు పురపాలక సంఘం కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నా... పూర్తి స్థాయిలో నీరందించలేని పరిస్థితులు ఉన్నాయి. ఇలాంటి తరుణంలో చిప్పిలి వద్ద నిర్మించిన సమ్మర్‌స్టోరేజ్‌లోకి చేరుతున్న నీటిని అక్రమంగా జేసీబీతో గండి కొట్టడంతో నీరంతా వృథాగా పోతున్నాయి. దీనిపై అధికారులు క్షేత్రస్థాయిలో వెళ్లి పరిశీలించారే తప్పా ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం విమర్శలకు దారితీస్తోంది. అక్రమంగా మొరవ వద్ద తవ్వేసిన గండి ద్వారా గత ఐదు రోజులుగా దాదాపు 20 ఎంసీఎఫ్‌టీ (మిలియన్ క్యూబిక్ ఫీట్స్)కి పైగా నీరు వృథాగా వెళ్లిపోయింది.
మదనపల్లె పట్టణానికి దాహార్తి తీర్చేందుకు 59 ఎంసీఎఫ్‌టీ నీటి సామర్థ్యం కలిగిన సమ్మర్‌స్టోరేజ్ నిర్మాణం చేశారు. ఇందుకు గ్రామీణ మండలం అంకిశెట్టిపల్లె, పొన్నూటిపాళ్యం సరిహద్దులో దాదాపు 135 ఎకరాల వ్యవసాయ భూములు, చిప్పిలి గ్రామంలోని పలువురి వద్ద ప్రైవేటు స్థలాలను ప్రభుత్వం కొనుగోలు చేసి పరిహారం చెల్లించింది. ఐదేళ్ల కిందటే మట్టికట్ట పనులు పూర్తయ్యాయి. మరో 15 శాతం మొరవ పనులు, మరో ప్రాంతంలో మట్టికట్ట పనులు పూర్తి కావలసి ఉంది.
అసంపూర్తి పనులతో..
గత ప్రభుత్వం హయాంలో కృష్ణాజలాలు విడుదల చేసినా సమ్మర్‌స్టోరేజ్‌కు అవసరమైన నీరు నిల్వ చేయలేదు. అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం కూడా ఇటీవల మిగులు జలాలు విడుదల చేసినప్పటికీ అక్కడక్కడ అసంపూర్తిగా పనులు మిగిలి ఉండటంతో పాటు, మదనపల్లె సమ్మర్‌స్టోరేజ్‌కు నీరు ఇవ్వలేకపోయారు. పుంగనూరు, తంబళ్లపల్లె నియోజకవర్గాల్లోని పలు చెరువులకు ఈ నీటిని నింపారు. మదనపల్లెలోని చిప్పిలి సమ్మర్ స్టోరేజ్‌కు మాత్రం అవసరమైన నీరు విడుదల చేయలేదు.
కురుస్తున్న వర్షాలతో..
వర్షాలు కురుస్తుండంతో పశ్చిమ ప్రాంతాల్లోని కదిరమ్మచెరువు, మేడిపల్లె చెరువు, వెంకటమ్మచెరువుల మొరవలు పారుతున్నాయి. ఈ నీరు చిప్పిలి సమ్మర్‌స్టోరేజ్‌కు చేరుతున్నాయి. ఇక్కడ అక్రమంగా సాగుచేస్తున్న పంట పొలాల్లోకి చేరడంతో పాటు, అక్రమ ఇసుక తవ్వకాలకు ఇబ్బంది ఏర్పడుతుందనే దురుద్దేశంతో స్థానికంగా ఉంటున్న ఓ నాయకుడు ఆరు రోజుల కిందట జేసీబీవో పూర్తి కాని మొరవ పనుల సమీపంలో జేసీబీవో గండికొట్టేశారు. దీంతో సమ్మర్‌స్టోరేజ్‌కు చేరిన దాదాపు 20 ఎంసీఎఫ్‌టీకి పైగా నీరు వృథాగా వెళ్లిపోయింది. ప్రస్తుతం కేవలం 15 ఎంసీఎఫ్‌టీ నీరు మాత్రమే నిల్వ ఉంది. హంద్రీ-నీవా ప్రాజెక్టు అధికారులు మాత్రం ఇంతవరకు ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం గమనార్హం.
నీటి ప్రవాహం తగ్గితేనే..
నీటి ప్రవాహం తగ్గితేనే గండి పూడ్చేందుకు వీలవుతుంది. అడ్డుకట్టవేస్తే నీటి ప్రవాహానికి కొట్టుకుపోతుంది. గండిని పరిశీలించాం. ఉన్నతాధికారులకు నివేదిక ఇచ్చి వారి నిర్ణయాన్ని బట్టి చర్యలు తీసుకుంటాం. - గోపి, డీఈ, హంద్రీ-నీవా ప్రాజెక్టు, మదనపల్లె
ఇదీ చదవండీ...సీఎస్కే ఎందుకిలా విఫలవుతోంది!