రాష్ట్రంలో చాలాచోట్ల పురపోరు ఆసక్తికరంగా మారింది. ప్రచారంలో పార్టీలు నువ్వానేనా? అన్నట్లు దూసుకెళ్తున్నాయి. కృష్ణా జిల్లా జగ్గయ్యపేటలో.. వైకాపా, తెలుగుదేశం, భాజపా, జనసేన ఓట్లవేట హోరాహోరీగా సాగుతోంది. కొండపల్లి మున్సిపాలిటీ పరిధిలో వైకాపా నేతలు సగం చిరిగిన నోట్లు పంచారంటూ స్థానికులు తెలుగుదేశం నేత దేవినేని ఉమ దృష్టికి తీసుకొచ్చారు. ఈ విషయంపై రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసినా ఫలితం లేకుండా పోయిందని దేవినేని అన్నారు.
గుంటూరు జిల్లా దాచేపల్లి, గురజాల నగర పంచాయతీల పరిధిలో ఆయా పార్టీలు అభ్యర్థులకు మద్దతుగా అగ్రనేతలను రంగంలోకి దింపాయి. ఓటమి భయంతో గురజాల ఒకటో వార్డు అభ్యర్థి వెంకటేశ్‌ను కిడ్నాప్ చేశారంటూ కుటుంబసభ్యులు, తెలుగుదేశం శ్రేణులు ఆరోపించారు.
దాచేపల్లి పరిధిలో డబ్బులు పంపిణీ చేస్తున్నారంటూ తెలుగుదేశం కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వైకాపా తెలంగాణ అక్రమ మద్యాన్ని ఓటర్లకు పంపుతుంటే... అధికారులు ఏం చేస్తున్నారని నేతలు ప్రశ్నించారు.
ప్రకాశం జిల్లా దర్శి నగర పంచాయతీలో వైకాపా, తెలుగుదేశం కీలక నేతలు ఓట్లవేటలో నిమగ్నమయ్యారు. కడప జిల్లాలోని కమలాపురం, రాజంపేట పురపాలికల్లోనూ పార్టీలు గెలుపే లక్ష్యంగా తలమునకలయ్యాయి. కర్నూలు జిల్లా బేతంచెర్ల నగర పంచాయతీలో వైకాపా విజయం తథ్యమని మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ ధీమా వ్యక్తం చేశారు.
ఇదీ చూడండి: CM Review on Rains: బాధితులకు రూ.1000 చొప్పున తక్షణ సాయం: సీఎం జగన్