మామిడి పంట చేతికందే సమయం కావడంతో ఏనుగులు ఎప్పుడు ఎవరి తోటలు ధ్వంసం చేస్తాయోనని రైతులు హడలిపోతున్నారు. చిత్తూరు జిల్లాలో అవి వెళ్లే దారిలో ఇప్పటికే తవణంపల్లి, బంగారుపాళ్యం మండలాల్లోని పలువురు రైతుల పంటలను ధ్వంసం చేశాయి. ఏనుగులను వచ్చిన దారిలోనే మళ్లీ కౌండిన్య అటవీ ప్రాంతంలోకి మళ్లించేందుకు అటవీశాఖ అధికారులు ట్రాకర్ల ద్వారా ప్రయత్నం చేసినా ఫలితం లేకపోయింది. నెలన్నర క్రితం వరకు ఏకంగా 3 నెలల పాటు గుడిపాల మండలంలో రైతులను, అటవీశాఖ అధికారులు, సిబ్బందిని ముప్పతిప్పలు పెట్టిన ఇవి ఆపై తమిళనాడు రాష్ట్రంలోకి ప్రవేశించాయి. అక్కడి వారు మళ్లీ ఇటు తోలడంతో పలమనేరు సమీపంలోని కౌండిన్య మీదుగా ఇటు వచ్చాయి. మరో వైపు పుత్తూరు వైపు నుంచి ఒంటరి ఏనుగు గురువారం చిత్తూరు సమీపం నుంచి తవణంపల్లి మండలంలోకి ప్రవేశించింది. శెట్టేరి బీట్ దాటుకుని జగమర్ల వైపు వెళ్లినట్లు అటవీశాఖ అధికారులు తెలిపారు. ఇటు యాదమరి మండలంలోకి ప్రవేశించిన ఏనుగులను ఎంత త్వరగా ఈ ప్రాంతం నుంచి తిప్పి పంపితే పంటలకు అంత ముప్పు తప్పుతుందని రైతులు అంటున్నారు.
పక్క రాష్ట్రాల నుంచి రాక
తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల నుంచి వలస వచ్చే ఏనుగుల దాడుల్లో యాదమరి, గుడిపాల, బంగారుపాళ్యం, పలమనేరు, కుప్పం, రామకుప్పం మండలాల పరిధిలో పంటలు ఇటీవల ధ్వంసమయ్యాయి. నష్టాన్ని అధికారులు అంచనా వేసి ప్రభుత్వానికి నివేదించారు. ప్రభుత్వం మంజూరు చేసే నష్టపరిహారం నామమాత్రమేనని, తమకు పెట్టుబడి కూడా చేతికందడం లేదని రైతులు వాపోతున్నారు. గుడిపాల మండలంలో నెలల తరబడి తిష్ఠ వేసిన కరి సమూహాన్ని అతి కష్టం మీద తమిళనాడుకు మళ్లించారు. కౌండిన్య అటవీ ప్రాంతంలో 75 ఏనుగులుండగా, వీటికి అదనంగా తమిళనాడు, కర్ణాటక వైపు నుంచి వలస వస్తున్నాయి. గతేడాది కురిసిన వర్షాలకు అటవీ సమీప ప్రాంతాల్లోని చెరువులు, కుంటల్లో నీటి లభ్యత ఉండడం, ఏనుగులకు ఇష్టమైన వరి, అరటి, చెరకు, మామిడి పంటలు ఉండటంతో అవి పంట పొలాల్లోకి వస్తున్నాయి. ఈ క్రమంలో వాటికి ఎవరైనా అడ్డు పడితే దాడులు చేస్తున్నాయి.
అధికారుల అప్రమత్తం
14 ఏనుగులు సమూహంతో పాటు అటు ఒంటరి ఏనుగు సంచరిస్తుండడంతో అటవీశాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. గురువారం యాదమరి మండలంలోని నుంజర్ల ప్రాజెక్టు సమీపంలోని అడవిలో ఏనుగులు ఉన్నట్లు గుర్తించారు. ఆ శాఖ పశ్చిమ విభాగం డి.ఎఫ్.ఓ రవిశంకర్ ఆధ్వర్యంలో రేంజ్ అధికారి సుభాష్, డీఆర్‌ఓ శివరామ్‌తో పాటు, బీట్ అధికారులు, సిబ్బంది ట్రాకర్ల ద్వారా ఏనుగులను అడవుల్లోకి డ్రైవ్ చేస్తున్నారు. ప్రజలు సంయమనం పాటించాలని, ఏనుగులు కనిపిస్తే తమకు సమాచారం ఇవ్వాలని, వాటిని రెచ్చగొట్టే సాహసం ఎవరూ చేయవద్దని హెచ్చరించారు.
ఇదీ చదవండీ.. కొవిడ్ ఆస్పత్రులను సందర్శించకుండా.. తెదేపా నేతల గృహ నిర్బంధం