చిత్తూరు జిల్లాలోని శేషాచల అడవుల్లో ఎర్రచందనం అక్రమ రవాణా జోరుగా సాగుతోంది. ఈ రోజు ఉదయం చంద్రగిరి మండలంలోని శ్రీవారిమెట్టు సమీపంలో 22 ఎర్ర చందనం దుంగలను టాస్క్ఫోర్స్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. బుధవారం రాత్రి నుంచి చామల రేంజ్ నాగపట్ల ఈస్ట్ సెక్షన్ పరిధిలో పోలీసులు కూంబింగ్ చేపట్టారు.
గురువారం తెల్లవారుజామున శ్రీవారి మెట్టు వైపున కొందరు వ్యక్తులు ఎర్రచందనం దుంగలను మోసుకుని వస్తూ కనిపించారు. టాస్క్ఫోర్స్ సిబ్బందిని గమనించిన వారిలో కొందరు మిగిలిన వారిని హెచ్చరించేలా కేకలు పెట్టారు. దీంతో అందరూ దుంగలను పడవేసి దట్టమైన ఆటవీప్రాంతంలోకి పారిపోయారు. ఆ ప్రాంతం పరిశీలించగా 721 కేజీలున్న 22 ఎర్రచందనం దుంగలు లభ్యమయ్యాయి. వీటి విలువ సుమారు 40 లక్షల రూపాయల వరకు ఉండొచ్చని ఎస్పీ సుందరరావు వివరించారు. పారిపోయిన వారి కోసం గాలిస్తున్నట్లు తెలిపారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చదవండి: Friendship: స్నేహితుడిని దూరం చేస్తోందని.. అతడి భార్యకు వేధింపులు